HMPV: చైనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ తప్పదా ? కేంద్రం క్లారిటీ ఇదే….

చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్ లో కనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, ఆహ్మదాబాద్ లో ఓ కేసు నమోదయ్యాయి. చైనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన చిన్నారుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపి పరీక్షలు చేస్తున్నారు.


వైరస్ వ్యాప్తిని ఐసీఎంఆర్ అనుక్షణం అంచనా వేస్తూ కేంద్రానికి తగు సూచనలు చేస్తోంది. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఇలాంటి సమయంలో చైనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, దీంతో కేంద్రం గతంలో విధించినట్లుగా మరోసారి లాక్ డౌన్ విధిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. చైనాలో వైరస్ ప్రభావానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో భారత్ లోనూ ఒక్కసారిగా ఈ వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీంతో కేంద్రం కూడా లాక్ డౌన్ కు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ పేరుతో థంబ్నెయిల్స్ పెట్టి అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది. దీంతో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లాక్ డౌన్ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని తెలుస్తోంది. కాబట్టి ఇకపై ఇలాంటి ప్రచారాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.