సినీనటుడు వెంకటేశ్‌ కుటుంబసభ్యులపై కేసు

www.mannamweb.com


సినీనటుడు వెంకటేశ్‌ కుటుంబ సభ్యులపై (Daggubati Family) కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ జరిగింది: గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని.. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్‌బాబు, రానా, అభిరామ్‌లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని.. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.