ఏపీలో భూవివాదాలకు చెక్ పెట్టేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ ప్రజలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే ఆగత్యం తప్పడం లేదు.
ముఖ్యంగా తమ భూమి తమ పేరు మీదే ఉందా లేదా అప్పటికప్పుడు తెలుసుకునే పరిస్దితి లేదు. అలాగే రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, లంచాలు సమర్పించుకోవడం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ యాప్ ద్వారా వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
రాష్ట్రంలో ప్రజలు తమ భూముల వివరాలు తెలుసుకునేందుకు , రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఆ వివరాలు తెలుసుకునేలా చేయడం కోసం ప్రభుత్వం త్వరలో కొత్త యాప్ తీసుకురాబోతోంది. ఇందులోనే రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ అందుబాటులో ఉంచుతారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్లకు నమోదు చేసుకునేందుకు అనుమతిస్తారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ పనిచేయనుంది.
త్వరలో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. అతి త్వరలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అందుబాటులోకి తెస్తారు. ఫిబ్రవరి చివరి నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.కార్డు 2, కార్డు 2.0 సాఫ్ట్ వేర్లను అభివృద్ధి చేయడం కోసం త్వరలో టెండర్లు పిలువబోతున్నారు. ఇవి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ పూర్తయితే భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లలో కచ్చితత్వం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కొత్తగా తెచ్చే యాప్, సాఫ్ట్ వేర్లలో సర్వే ఆఫ్ ఇండియా, శాటిలైట్ చిత్రాలు, డీటీసీపీ జాబితా, మునిసిపల్, సర్వే విభాగం, ఎఫ్‌ఎంబీ, బ్యాంకుల్లో సమాచారం, భూముల చిత్రాలు ఒకే చోట కనిపిస్తాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు వాటిలో కచ్చితత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. ఫోన్లలోనూ భూముల వివరాలు వారు తెలుసుకునేలా యాప్ ఉండబోతోంది. భూమి దగ్గరికి వెళ్లి ఆ యాప్ ఓపెన్ చేస్తే దాని ప్రాథమిక వివరాలు తెలిసేలా ఈ యాప్ ఉండబోతోంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నకిలీలు, డబుల్ రిజిస్ట్రేషన్ల బెడత తగ్గుతుందని భావిస్తున్నారు.