Kanuma 2025: కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? అసలు రహస్యం ఇదే

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన,పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ఈ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ జరిగే మూడు రోజులు పల్లెటూర్లన్నీ పండగ వాతావరణంతో కలకలలాడుతుంటాయి.

ఈ పండుగలకు ప్రజలంతా ఎక్కడున్న కూడా తమ సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. కొత్త అల్లుళ్లు, బుంధుమిత్రుల రాకతో తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది.

సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే చాలామంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయల్దేరేందుకు ట్రై చేస్తుంటారు..కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు మరుసటి రోజు బయల్దేరండి అని మన పెద్దలు వారించడం చాలా సందర్భాలలో గమనించి ఉంటాం. కనుమ రోజు చెట్టుమీద ఉన్న కాకులు కూడా కదలవు అనే సామెతను కూడా చెప్తుంటారు పెద్దలు. అయితే కనుమ రోజున అసలు ప్రయాణం ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

కారణం ఇదే

కనుమ అంటే పశువుల పండుగ. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవిచేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకునే రోజుగా కనుమని చెబుతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి,వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు.

కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దు అని చెప్పడం వెనుకాల అనేక కథనాలు ఇప్పటికి ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే..గతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎడ్ల బండులే దిక్కుగా ఉండేది. కనుమ రోజు ఎద్దులను అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజించేవారు. దీంతో పాటు ఆరోజున వాటికి ఇష్టమైన మేత వేసి వాటికి రెస్ట్ ఇచ్చే వారు. ఆ ఒక్కరోజైనా కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకే కనుమ రోజు ప్రయాణం వద్దని మన పెద్దలు చెప్పేవారు. నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండగని భావిస్తారు.

ఇది కూడా మరో కారణం

బాగా ప్రాచుర్యంలో ఉన్న మరో కథ ఏంటంటే కనుమ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని చెబుతారు. అందుకే చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటారు . దీని వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. వారికి ఇష్టమైన పిండి పదార్థాలు, మద్యం మొదలైనవి చేసి పెట్టి వారి ప్రసాదంగా ఇంట్లో వాళ్లు స్వీకరిస్తారు.

కనుమ రోజున ఇంట్లోని వారందరూ కలిసి అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే పశువులను పూజించి, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి, సుష్టుగా భోజనం చేయడం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా మన శరీరం అనేది కొంత బద్ధకంగా తయారవుతుంది. దీని వల్ల ప్రయాణం చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రయాాణాలు చేయవద్దని అంటారు.

కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది

పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి తినాలనే నియమం కూడా కనుమ రోజుకు ఉంది. కాబట్టి ఆ రోజు ఆగి పెద్దలను తలచుకోవాలనీ బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున ప్రయాణించాలని చెబుతుంటారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదని,లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటుంటారు.