సెప్టెంబర్తో ముగిసే 2024-25 సీజన్కు 10 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతించింది.
దేశంలో 18 నెలల కనిష్టానికి చేరిన పంచదార ధరల నుంచి కోలుకునేందుకు చక్కెర పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం లక్ష్యం.
ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి.. ప్రభుత్వ చర్య ఐదు కోట్ల రైతు కుటుంబాలకు & ఐదు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని, చక్కెర రంగాన్ని కూడా బలోపేతం చేస్తుందని వివరించారు. చక్కెర మిల్లులకు నగదు లభ్యత పెరుగుతుందని, చెరకు రైతులకు సకాలంలో బకాయిల చెల్లింపు జరుగుతుందని వెల్లడించారు. ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ దేశంలో షుగర్ రేట్ల సమతుల్యతను కాపాడతామని పేర్కొన్నారు.
ఆహార మంత్రిత్వ శాఖ ఆర్డర్లో, కేటాయించిన పరిమాణంలో అన్ని గ్రేడ్ల చక్కెర ఎగుమతులకు అనుమతి లభించింది. 2024-25 సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించే కొత్త మిల్లులు & మూసివేత తర్వాత కార్యకలాపాలను పునఃప్రారంభించే మిల్లులు కూడా ఎగుమతి కోటా పొందాయి.
చక్కెర మిల్లులు నేరుగా లేదా మర్చంట్ ఎగుమతిదారుల ద్వారా సెప్టెంబర్ 30 వరకు ఎగుమతి చేసుకోవచ్చు. రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి, మార్చి 31లోపు కోటాలను సరెండర్ చేయడానికి లేదా దేశీయ కోటాలతో మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆహార మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి, పరస్పర ఒప్పందాల ద్వారా దేశీయ నెలవారీ విడుదల పరిమాణాలతో ఎగుమతి కోటాను మార్చుకోవడానికి ఈ విధానం చక్కెర మిల్లులను అనుమతిస్తుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద చక్కెర ఎగుమతులు ప్రస్తుత నిబంధనల ప్రకారం కొనసాగుతాయి.
18 నెలల కనిష్ట స్థాయిలో చక్కెర ధరలు
దేశంలో పంచదార రేట్లు 18 నెలల కనిష్టానికి పడిపోవడంతో షుగర్ మిల్లుల లాభాలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశ చక్కెర ఉత్పత్తి గత సీజన్లోని 32 మిలియన్ టన్నుల నుంచి 2024-25 సీజన్లో 27 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. ఇది, దేశీయ వార్షిక వినియోగానికి అవసరమైన 29 మిలియన్ టన్నుల కంటే తక్కువ.
‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్’ రిపోర్ట్ ప్రకారం, జనవరి 15 వరకు దేశంలో చక్కెర ఉత్పత్తి 13.06 మిలియన్ టన్నులుగా ఉంది. ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున గత సంవత్సరంతో పోలిస్తే 13.66 శాతం తగ్గింది.
దేశీయంగా సరఫరా తగ్గడంతో, 2023-24 సీజన్లో, చక్కెర ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది.
ధరలు పెరిగే అవకాశం?
షుగర్ ఎక్స్పోర్ట్స్పై ప్రభుత్వం గత సీజన్లో నిషేధం విధించిన తర్వాత, దేశీయంగా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు, ఎగుమతులకు మళ్లీ పచ్చజెండా ఊపడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా రేట్లలో సమతౌల్యం ఉండేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకటించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో మళ్లీ రేట్లు పెరుగుదలను చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే, చక్కెర చేదెక్కబోతోందన్నమాట.
































