మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎవరిని చూసుకుని రెచ్చిపోయి దాడులకు పాల్పడేవారూ ఆ వ్యక్తి ఎన్ కౌంటర్ లో మరణించాడు.
అతనే చలపతి. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తే చలపతి. జనవరి 19నుంచి చత్తీస్ గఢ్ , ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 19 మంది మావోలు మరణించారు. అందులో చలపతి ఒకరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడపై అలిపిరిలో బాంబు దాడి చేసింది కూడా చలపతే. దాంతో అతనిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. అంతేకాదు అతనిపై రూ. 1కోటి రివార్డు కూడా ప్రకటించింది.
2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో మావోయిస్టుల దాడికి చలపతి నాయకత్వం వహించాడు. ఈ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 2008 ఫిబ్రవరి 15న జరిగిన దాడికి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ప్లాన్ చేశారని, అయితే దానిని అమలు చేసింది చలపతి అని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల ఆయుధాలను దోచుకుని నయాఘర్ నుంచి మావోయిస్టులు విజయవంతంగా తప్పించుకోవడానికి సహకరించింది చల్పతి అని అధికారి తెలిపారు.
ఎవరీ చలపతి?
చలపతి అలియస్ జయరాం రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వాసి. ఆయనకు చలపతి,రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఇతన్ని చాలా మంది చలపతిగానే గుర్తించారు. మదనపల్లెలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. పై చదువులు చదవలేదు. చిన్నప్పటి నుంచి మావో అవ్వాలనే కోరిక ఉండేది. 10వ తరగతిలో మరింత ఎక్కువైంది. అందుకు కారణం మదనపల్లెలో అప్పట్లో కనీస వసతులు లేకపోవడం, విద్యార్థులకు అవకాశాలు లేకపోవడంతోపాటు కులవివక్ష.
ఆ విధంగా మావోయిస్టుగా మారాడు చలపతి. తన చాకచక్య ధోరణి, నేత్రుత్వ లక్షణాలతో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా మారాడు. ఏ ప్రాంతం మీద అయితే ప్రభుత్వం చిన్నచూపు చూసిందో ఎక్కడైతే ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందకుండా అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో చలపతి ప్లాన్ వేసి దాడులకు పాల్పడుతుండేవాడు. అతను పలాన్ వేస్తే అది పక్కా జరుగుతుందని నమ్మేవారు. చాలా సార్లు చలపతి తమ న్యాయం జరిగిందంటూ కొందరు ప్రజలే ఆయన్ను పట్టించకుండా రక్షించేవారు.
సెల్ఫీ పట్టించింది :
చలపతి మరణానికి కారణం ఓ రకంగా సెల్ఫీ అనే చెప్పాలి. 2016లో విశాఖలో కొయ్యూరు మండలంలో భద్రతా బలగాలు మావోయిస్టు నేత ఆజాద్ ను మట్టుబెట్టారు. ఆ ఆజాద్ చలపతి భార్య అరుణకు తమ్ముడు. అజాద్ చనిపోయినప్పుడు అతని నుంచి సేకరించిన వస్తువుల్లో ల్యాప్ టాప్ తోపాటు చలపతి, అరుణలు కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా దొరికింది. అప్పటి వరకు చలపతి, అరుణ ఎలా ఉంటారో పోలీసులకు తెలియదు. ఫొటోలు ఉన్నప్పటికీ వారి ముఖాలు క్లియర్ కనిపించేవి కావు. కానీ అజాద్ దగ్గర దొరికిన సెల్ఫీలో మాత్రం క్లియర్ గా వారి ముఖాలు కనిపించాయి. అప్పటి నుంచి చలపతిపై ఫోకస్ మరింత పెరిగింది. ఆ ఫొటోలను ప్రింట్ తీయించి అన్ని ప్రాంతాల్లో అంటించి పెట్టారు. అతన్ని పట్టిస్తే రూ. 1కోటి రివార్డు ఇస్తామని చెప్పారు.
అయితే చలపతిపై ఇంత భారీ రివార్డు ప్రకటించడానికి కారణం ఉంది. అలిపిరిలో చంద్రబాబుపై దాడి చేయడం ఇందుకు కారణం. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మావోలకు వ్యతిరేకంగా పాలసీలు తీసుకువచ్చారు. తాను మావోలకు వ్యతిరేకిని..ఏదైనా సూటిగా వచ్చి మాట్లాడే దమ్ము ఉండాలని అనేవారు. దాంతో చలపతి చంద్రబాబును టార్గెట్ చేశారు. మావోలకు వ్యతిరేకంగా గ్రే హౌండ్ బలగాలను రంగంలోకి దింపడంతో చలపతి చంద్రబాబుపై పగ పెంచుకున్నాడు. అక్టోబర్ 1న చంద్రబాబు అలిపిరి వైపు నుంచి వెళ్తారని సమాచారం అందుకుని ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేయించాడు. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుతోపాటు మరోరెండు కార్లు పేలిపోయాయి. చంద్రబాబు అద్రుష్టం బాగుండి గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కమాండోల ద్వారా భద్రత కల్పిస్తున్నారు.
































