విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు నవ్వారని చెప్పి..
తన చెప్పుతో కొట్టాడు ఉపాధ్యాయుడు. ఈ ఘటన అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగులపల్లి జడ్పీ హైస్కూల్లో వెలుగు చూసింది.
9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ ఉదయం స్కూల్ ప్రాంగణంలో ఆడుకుంటూ సరదాగా నవ్వారు. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి.. ఆ ముగ్గురు అమ్మాయిలు తనను చూసి నవ్వారని భావించి, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తన చెప్పు తీసుకొని.. ఆ ముగ్గురు విద్యార్థినుల పైకి విసిరికొట్టాడు. దీంతో విద్యార్థినుల మెడకు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత విద్యార్థినులు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఇక తల్లిదండ్రులు తరలివచ్చి.. స్కూల్ ఆవరణలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. డీఈవో ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈవో పేర్కొన్నారు.
































