Tata Motors: టాటా హైడ్రోజన్‌ ట్రక్కులు

హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకునే ఇంజిన్లతో తయారు చేసిన ట్రక్కులను ప్రస్తుత త్రైమాసికంలోనే ప్రయోగాత్మకంగా రోడ్లపైకి తెచ్చేంద]ుకు టాటా మోటార్స్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సన్నాహాలు చేస్తున్నాయి. జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా వీటిని 12-18 నెలల పాటు రోడ్లపై తిప్పనున్నారు. తద్వారా ఈ ట్రక్కుల పని తీరు, సామర్థ్యాన్ని అంచనా వేయడం, హైడ్రోజన్‌ ఇంధనాన్ని నింపుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు ఎంతమేర కల్పించాలనే సమాచారాన్ని సేకరించనున్నారు. టాటా, ఐఓసీ కలిసి జంషెడ్‌పూర్‌-కళింగనగర్, ముంబయి-అహ్మదాబాద్, ముంబయి-పుణె మార్గాల్లో 15 హైడ్రోజన్‌ ట్రక్కులను తిప్పబోతున్నాయి. హైడ్రోజన్‌ ఇంధనంగా వినియోగించుకునే ఇంజిన్లను వాణిజ్య పద్ధతిలో చేపట్టేందుకు మార్గాలు, హైడ్రోజన్‌ బంకుల ఏర్పాటు అవసరాలను పరిశీలించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ వెల్లడించారు.


దేశంలో వాణిజ్య వాహనాల (సీవీ) విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని టాటా మోటార్స్‌ అంచనా వేస్తోంది. ఇటీవల దిల్లీలో జరిగిన భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో-2025లో టాటా మోటార్స్‌ తన గ్రౌండ్‌బ్రేకింగ్‌ హైడ్రోజన్‌ పవర్డ్‌ వాణిజ్య వాహనం టాటా ప్రైమా హెచ్‌.28ని విడుదల చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.