దేశంలో చాలా కాలంగా వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోంది పెట్రోల్ డీజిల్ ధరల భారం ఎప్పుడు తగ్గించబడుతుందనే. వాస్తవానికి కొన్ని నెలల కిందట ప్రతిరోజూ వీటి రేట్లను చమురు కంపెనీలు మార్పులు చేస్తూ ఉండేవి.
కానీ ఇప్పుడు చాలా కాలం నుంచి పెద్ద మార్పులు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది దేశంలోని కోట్ల మంది వాహనదారులకు సంతోషాన్ని కలిగించే వార్త. పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలకు పోటీగా ప్రైవేటు కంపెనీలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ముఖేష్ అంబానీకి చెందిన Jio-BPతో పాటు Nayara వంటి ప్రైవేట్ కంపెనీలు రేట్ల యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేటు కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న చమురు ప్రయోజనాలను తమ వినియోగదారులకు అందజేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న అనేక పెట్రోలియం కంపెనీలు 2024 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ విక్రయ ధరల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ విక్రయాల్లో 97% నియంత్రిస్తున్న జియో బీపీ, నయారా కొన్ని ప్రాంతాల్లో ధరలను లీటరును రూ.5 వరకు తగ్గించడం గమనార్హం. రిటైల్ ధరలను తగ్గించడమే కాకుండా, పెట్రోల్-డీజిల్ బల్క్ కొనుగోలుపై కూడా ప్రైవేట్ కంపెనీలు తగ్గింపును కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి.
ప్రైవేటు రిఫైనరీలు తగ్గింపు ధరలకు చాలా ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు విక్రయాల విషయంలో వెనకబడుతున్నాయి. బండ్ డీలర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో ప్రైవేటు కంపెనీలు ప్రధాన పాత్రధారులుగా కొనసాగుతూ భారీగా అమ్మకాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల విక్రయాల ద్వారా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు పెద్ద పోటీని చూస్తున్నాయి.
అంబానీకి చెందిన రిలయన్స్ జియో పెట్రోల్ బంకుల్లో హ్యాపీ అవర్స్ పేరుతో తగ్గింపు ధరలను అందిస్తున్నాయి. ఈ వేళల్లో సాధారణంగా విక్రయ ధరల కంటే లీటరుకు దాదాపు రూ.3 వరకు ప్రత్యేక తగ్గింపును డీలర్లు అందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేయబడింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రైవేటు పెట్రోల్ బంకులు సైతం ప్రభుత్వ సంస్థల కంటే లీటరుకు దాదాపు రూ.1 వరకు కనీస తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఇక పోతే నయారా ఎనర్జీ సంస్థ లీటరుకు జియో కంటే ఎక్కువగా రూ.5 తగ్గింపుతో చమురు విక్రయాలను చేపడుతోంది.
ప్రస్తుతానికి ప్రభుత్వ కంపెనీలు అధిక ఆదాయాలను, లాభాలను చూస్తున్నాయి. ప్రైవేటు ఆటగాళ్లు రష్యా చమురు తక్కువకు రావటంతో దానిని తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించటం దీర్ఘకాలంలో ప్రభుత్వ సంస్థలకు పెద్ద దెబ్బగా మారుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 90,000 కంటే ఎక్కువ రిటైల్ పెట్రోల్ బంకులు నిర్వహించబడుతున్నాయి. వీటిలో నయారాకు అత్యధికంగా 6500 బంకులు ఉన్నాయి. జియో కూడా తన విస్తరణను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
































