AP Land Registration: రాత్రికి రాత్రి ఏపీలో భారీ మార్పు..

వేటి ధరలు పెరిగినా, పెరగకపోయినా.. భూముల ధరలు పెరుగుతూనే ఉంటాయి. జనాభా సంఖ్య పెరిగినంతకాలం.. భూములకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఏపీ మొదటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి కాబట్టి..
అక్కడ ఎప్పుడూ భూములకు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఓ విషయాన్ని గమనించింది. ప్రభుత్వ లెక్కల్లో భూముల ధరలు తక్కువగా ఉంటే.. రియల్‌ మార్కెట్‌లో ధరలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ పెద్దగా రావట్లేదనుకున్న సర్కార్.. భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచేసింది. యావరేజ్‌గా 20 శాతం ధరలు పెరిగాయి.


అర్థరాత్రి 12 తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువల్లో మార్పులొచ్చేశాయి. కొత్త ఛార్జీలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఐతే.. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ల ధరలు తగ్గాయి, మరికొన్ని చోట్ల ఎలాంటి మార్పూ లేదు. లోపాలను సరిదిద్దే క్రమంలో ఈ మార్పులు జరిగాయి.

అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. భూముల విలువల్లో మార్పులొచ్చాయి. విశాఖలో ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో ధరలు 9 శాతం దాకా పెరగగా.. అమరావతి ప్రాంతంలో ధరలు పెంచలేదు. గుంటూరు జిల్లాలో కూడా కొన్నిచోట్ల ఛార్జీలను తగ్గించారు. ఏలూరు జిల్లాలో 15 శాతం విలువలు పెరగగా.. అనకాపల్లి పట్టణంలో స్థిరంగా ఉన్నాయి. కాకినాడలో తగ్గగా.. అంబేద్కర్‌ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లో ధరలు పెరిగాయి.

నిన్న మొన్న రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. ఓ దశలో కొన్నిచోట్ల సర్వర్ మొరాయించింది కూడా. రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో.. ప్రజలు హడావుడిగా రిజిస్ట్రేషన్స్ చేయించేసుకున్నారు. కొన్నిచోట్ల రాత్రి 10 తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. గురు, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రూ.220 కోట్ల దాకా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు వచ్చినట్లు తెలిసింది. ఇవాళ్టి నుంచి ఈ జోరు తగ్గే అవకాశం ఉంది.

గత వైసీపీ హయాంలో భూముల విలువల్లో చాలా అక్రమాలు జరిగాయంటున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తాము వాటన్నింటినీ సరిచేశామని అంటోంది. ఐతే.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన చోట భూముల విలువ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించిన ప్రాంతాల్లో ఆల్రెడీ భూములు కలిగివున్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.