Smartphones and TVs ధరలు ఏ మాత్రం తగ్గుతాయి?

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో కీలకమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాలపై ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను వివరించారు.


ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన బడ్జెట్‌ నిర్ణయాల్లో మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (PCBA)పై ప్రాథమిక కస్టమ్‌ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడం ఒకటి. ఈ చర్య భారతదేశంలో ఇంకా తయారు చేయని కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లతో సహా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాల ధరను తగ్గిస్తుంది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు తాజా తగ్గింపు ఇంపోర్టెడ్‌ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించవచ్చు.

దేశ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను మెరుగుపరచగలదంటూ పరిశ్రమ నాయకులు ఈ చర్యను స్వాగతించారు. మొబైల్ ఫోన్‌లు, పీసీబీఏ, ఛార్జర్‌లపై ప్రాథమిక కస్టమ్‌ సుంకాన్ని తగ్గించడంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమయ్యే ఇన్‌పుట్‌లు, ముడి పదార్థాలపై మినహాయింపులను ఇస్తే దేశీయ ఉత్పత్తి వాతావరణం మెరుగుపడుతుందని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను మరింత చవకగా మార్చడానికి ఇది సానుకూల దశ అని ట్రాన్‌షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ప్రశంసించారు.

పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చు..
కస్టమ్స్ సుంకం తగ్గింపు కచ్చికంగా తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదు. అయితే రిటైల్ ధరలపై దాని ప్రత్యక్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధరలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు స్మార్ట్‌ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు అంటున్నారు. అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం ఎంతనేది ఆయా తయారీదారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పైపెచ్చు తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లపై ఇప్పటికే తక్కువ మార్జిన్‌లు ఉంటున్నాయని, కాబట్టి ధరలో చెప్పుకోదగ్గ తగ్గింపు కనిపించకపోవచ్చు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.