సీనియర్ నటి పుష్పలత మృతి

సీనియర్‌ నటి పుష్పలత(Pushpalatha)(87) చెన్నైలో కన్నుమూశారు. టి. నగర్‌లోని తిరుమల పిళ్ళై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం రాత్రి 9 గంటల ్రపాంతంలో కన్నుమూశారు.


తమిళనాడు కోయంబత్తూర్‌లోని మేటుపాలయానికి చెందిన ఈమె, తొమ్మిదవ ఏటనే భరతనాట్యంలో శిక్షణ పొందారు.

నటుడు ఎస్సే నటరాజ్‌ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘నల్ల తంగై'(1955) అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఆరంగేట్రం చేసిన పుష్పలత.. ‘కొంగు నాట్టు తంగం’ (1962) సినిమాతో కథానాయకగా పరిచయమయ్యారు. ఆ తర్వాత హీరోయిన్‌గా, ఆర్టిస్టుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో శారద, పార్‌ మగళే పార్, నానుమ్‌ ఒరు పెన్‌ సంతానం, కర్పూరం, జీవనాంశం, దర్శనం, కళ్యాణ రామన్, సకల కళావల్లభన్, సిమ్లా స్పెషల్‌’ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశారు.

ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఏఎం రాజా వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. ఎన్టీఆర్‌ హీరోగా కోవెలమూడి భాస్కర్‌ రావ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చెరపకురా.. చెడేవు!’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత ‘ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్‌ రౌడీ, విక్రమ్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారామె.

అదేవిధంగా కన్నడలో ‘జీవనజ్యోతి, ఉలవే బాదుడు, ఎరడు కనసు’, మలయాళంలో ‘నర్స్‌’, హిందీలో ‘మై భీ లడకీ హూ’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేశారు పుష్పలత. కాగా తమిళంలో ఏవీఎం రాజన్‌కు జంటగా ‘నానుమ్‌ ఒరు పెన్‌’ అనే చిత్రంలో నటించారామె. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 1964లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి. ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.