విజయవాడలో జరిగిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ తీరు పూర్తిగా మారనుందని స్పష్టం చేస్తూ..రాబోయేది జగన్ 2.0 కాలం..
ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది” అని ప్రకటించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇంతకాలం ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాను. ప్రజల సంక్షేమమే నా మొదటి అజెండాగా పెట్టుకున్నాను.
కానీ.. కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇకపై వారి కోసం ప్రత్యేకంగా పని చేస్తాను అని తెలిపారు. పార్టీ కార్యకర్తల బలంతోనే వైసీపీ ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై అవాంఛిత దాడులు, అక్రమ కేసుల పెంపును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మా కార్యకర్తలను తిప్పలు పెడుతోంది.
దొంగ కేసులతో వేధిస్తోంది. కానీ.. మనం వెనక్కి తగ్గబోము. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులపై, పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తాము అని ఆయన హెచ్చరించారు. జగన్ తన ప్రసంగంలో ఎంతో ధీమాగా .. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. ఒక్కసారి గెలిస్తే, రాబోయే 30 ఏళ్లు వైసీపీ పరిపాలన కొనసాగుతుంది.
ఎంత పెద్ద కూటములు వచ్చినా.. ఏం చేసినా, మన బలం, ప్రజల మద్దతు మనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా జగన్ తన కొత్త కార్యాచరణను స్పష్టం చేస్తూ.. కార్యకర్తలకు ఓ కొత్త ఆశను నింపారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు.
































