మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సామాన్య, మధ్య తరగతి వారికి పన్ను మినహాయింపును పెంచగా.. ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI).. రెపో రేటును తగ్గించి..
మంచి పని చేసింది. ఇదివరకు రెపో రేటు.. 6.5 ఉండగా.. ఇప్పుడు ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అందువల్ల కొత్త రెపో రేటు 6.25గా ఉంది.
రెపో రేటు తగ్గించడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఈ నిర్ణయం వల్ల.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్ కడుతున్న వారికి వడ్డీ భారం తగ్గనుంది. అలాగే నెలవారీ EMIలు చెల్లించేవారికి.. వడ్డీ భారం తగ్గనుంది.
రెపో రేటు అంటే:
ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ (MPC).. రెపో రేటును తగ్గించింది. కొంతమందికి ఈ రెపో రేటు అంటే.. ఆర్బీఐ ఇతర బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు దానిపై వేసే వడ్డీ రేటు. ఇప్పుడు దీన్ని ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది కాబట్టి.. బ్యాంకులకు తక్కువ వడ్డీకే రుణం వచ్చినట్లు అవుతుంది. అప్పుడు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. అందువల్ల ఈ నిర్ణయం పేదలు, మధ్య తరగతి వారికి మేలు చెయ్యనుంది. చివరిసారిగా మే 2020లో ఆర్బీఐ ఇలా రెపో రేటును తగ్గించింది.
పొంచివున్న ద్రవ్యోల్బణం:
ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎలా గంటే.. దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. దాంతో.. ఆ డబ్బుతో వస్తువులు కొంటారు. దాంతో.. వస్తువులకు డిమాండ్ పెరిగి.. ఉత్పత్తి పెరుగుతుంది. అంటే.. పారిశ్రామిక రంగం ఊపందుకుంటుంది. ఫలితంగా పరిశ్రమల్లో ఉద్యోగులకు పని, వేతనం లభిస్తాయి. దాంతో.. వారు వస్తు కొనుగోళ్లు పెంచుతారు. ఇలా ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి ఈ నిర్ణయం మేలు చేస్తుంది. ఐతే.. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంటుంది. ప్రజల కొనుగోళ్లు పెరిగేటప్పుడు.. వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా సరిచెయ్యాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐ పైనే ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, వాణిజ్య సమస్యలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. టారిఫ్ వార్ మొదలుపెట్టి.. చాలా దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. ఒక్కోసారి వాటిని నిలుపుదల చేస్తున్నారు. ఇండియా విషయంలో ఇంకా సీరియస్ యాక్షన్ లేదు. కానీ ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ముందే చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఒకింత సాహసంతో కూడినదే.
మరోవైపు మన రూపాయి మారకపు విలువ బాగా తగ్గిపోయింది. తొలిసారిగా అది 87 రూపాయల కంటే తగ్గిపోయింది. ఇది చరిత్రలో తొలిసారి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా రూపాయిని బలపరిచే చర్యలు చేపట్టాలి. ఎగుమతులను భారీగా పెంచాలి. దిగుమతులను తగ్గించుకోవాలి. ఇవాళ ఉదయం రూపాయి 16 పైసలు బలపడింది. కానీ ఏళ్లుగా విలువ తగ్గిపోతూనే ఉంది.
































