Thandel Review; చిత్రం: తండేల్; నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ప్రకాశ్ బెలవాడి, కల్పలత, ఆడుకాలం నరేన్, కరుణాకరన్, పృథ్వీరాజ్, చరణ్‌దీప్, మహేష్, పార్వతీశం తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; ఎడిటింగ్: నవీన్ నూలి; సినిమాటోగ్రఫీ: షందత్ సయినుద్దీన్; కథ: కార్తిక్ తీడ; నిర్మాత: బన్ని వాసు; సమర్పణ: అల్లు అరవింద్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందూ మొండేటి; విడుదల: 07-02-2025
నాగచైతన్య (Naga Chaitanya) విజయాన్ని చూసి చాలా కాలమైంది. ‘ఈపాలి గురి తప్పేదేలేస్’ అంటూ సాగే సినిమాలోని సంభాషణలాగే… విజయంపై పూర్తి నమ్మకంతో ఆయన చేసిన చిత్రమే… ‘తండేల్’ (Thandel Movie). నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కూడిన కథ, విజయవంతమైన కలయికకి అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తోడైంది. మంచి అంచనాల మధ్య మూడు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది?
Thandel Movie Story || కథేంటంటే: సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే తండేల్. తన తండ్రి తండేల్ కావడంతో చిన్ననాటి నుంచే ఆయన దగ్గర్నుంచి నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని విని వాళ్లకోసం నిలబడటంతో అందరూ అతడిని తండేల్‌గా ఎంచుకుంటారు. రాజుకి చిన్ననాటి స్నేహితురాలైన సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ ప్రేమగా పిలుస్తుంటాడు. రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంలో వేటతోనే గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అని ఎదురు చూస్తూ గడుపుతుంటుంది. ఈసారి వేటకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొస్తారు. అలా ఈసారి సముద్రంలోకి వెళ్లాక తుపాను కల్లోలం సృష్టిస్తుంది. పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిన రాజు పడవని, అందులోని మత్స్యకారుల్ని అక్కడి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది? సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం నుంచి పాకిస్థాన్ సరిహద్దుల వరకూ వెళ్లిన ఆమె రాజుని, ఇతర మత్స్యకారుల్ని విడిపించిందా? రాజు, సత్య కలుసుకున్నారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Thandel movie review || ఎలా ఉందంటే: సముద్రంపైనే ఆధారపడే మత్స్యకారుల జీవితాల్ని, ఒక జంట మధ్య ప్రేమ, దేశభక్తిని సమపాళ్లల్లో ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచుతుందీ చిత్రం. ఇది నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తితో రూపొందిన చిత్రమన్న సంగతి తెలిసిందే. ముందు విన్నప్పుడు ఇదొక డాక్యుమెంటరీకి సరిపడే కథలా అనిపించిందని నాగచైతన్య ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. అలాంటి ఓ కథకి రాజు – సత్య మధ్య హృద్యమైన ప్రేమని ముడిపెడుతూ, దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు (thandel movie director) విజయవంతమయ్యారు. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి నటన, విజువల్స్, సంగీతం కలిసి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి.
కథానాయకుడిని పరిచయం చేస్తూ ఓ ఫైట్, ఓ పాట.. ఈ ఫార్ములాలోనే సినిమా మొదలవుతుంది. సముద్ర నేపథ్యం, రాజు – సత్య ప్రేమ, ఆ ఇద్దరి మధ్య విరహం, ఒకరి కోసం మరొకరు పరితపించే సన్నివేశాలు మెల్లగా ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి. ‘హైలెస్సా’, ‘బుజ్జితల్లి’ పాటలతోపాటు, మధ్యలో వచ్చే సన్నివేశాలు కథలోని ప్రేమకోణాన్ని, భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్తాయి. రాజు తండేల్‌గా ఎన్నికైనప్పుడు వచ్చే శివుడి పాట, వాటిని చిత్రీకరించిన విధానం కూడా ప్రథమార్ధానికి హైలైట్‌గా నిలుస్తాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచే అసలు కథ మొదలవుతుంది. సముద్రంలో తుపానుని చూపిస్తూ తీర్చిదిద్దిన ఆ సన్నివేశాలు బాగుంటాయి.
ద్వితీయార్ధంలో కథ పాకిస్థాన్‌కి చేరడంతో ప్రేమకథ కాస్త దేశభక్తివైపు మలుపు తీసుకుంటుంది. ఆ తరహా నేపథ్యం, సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసిందే అయినా, దేశభక్తి అనే భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో చాలావరకూ ప్రభావం చూపిస్తుంది. మరోవైపు రాజు తన మాట పెడచెవిన పెట్టి వేటకి వెళ్లాడనే కోపంతో సత్య తీసుకునే నిర్ణయాలు, ప్రేమ విషయంలో ఆమె పడే సంఘర్షణ, బందీలైన కుటుంబాలకు రావల్సిన డబ్బు కోసం గుజరాత్‌లో ఆమె చేసే పోరాటం, పాకిస్థాన్ చెర నుంచి వాళ్లని విడిపించడం కోసం ఆమె దిల్లీ వెళ్లడం వంటి సన్నివేశాలు ద్వితీయార్ధం కథని ఆసక్తికరంగా మార్చేస్తాయి. బందీల్ని విడిపించేందుకు అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తోపాటు, ఆమె కూతురు బన్సూరీ స్వరాజ్ చేసిన సాయం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాల్ని ఇందులో చూపించారు. పతాక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పెద్దగా ఉత్కంఠ రేకెత్తించకపోయినా, తగిన ముగింపే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఆజాదీ పాటని గుజరాత్‌లో సత్య చేసిన పోరాటంతో మొదలుపెట్టి, పాక్ జైల్‌లో రాజుపై వచ్చే సన్నివేశాల వరకూ వాడుకున్న విధానం ఆకట్టుకుంటుంది.
Thandel cast and crew || ఎవరెలా చేశారంటే: నాగచైతన్య, సాయిపల్లవి (Sai Pallavi) మధ్య కెమిస్ట్రీ, వాళ్లు పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్. రాజు, సత్య పాత్రల్లో ఆ ఇద్దరూ ఒదిగిపోయారు. పాత్రకి తగ్గట్టుగా నాగచైతన్య మారిపోయిన విధానం, సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. సాయిపల్లవి మార్క్ నటన, డ్యాన్స్‌కి తోడు, ఇందులో మరింత అందంగా కనిపించింది. ఇద్దరూ శ్రీకాకుళం యాసలో సంభాషణలు చెప్పారు. పక్కాగా కాకపోయినా, బలంగా ప్రయత్నించారు. ఆడుకాలం నరేన్, కల్పలత, కరుణాకరన్, పృథ్వీరాజ్, మహేష్ ప్రకాశ్ బెలవాడి, పార్వతీశం తదితరుల పాత్రలు గుర్తు పెట్టుకునేలా ఉంటాయి.
సాంకేతిక బృందం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్. ఆయన పాటలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. నేపథ్య సంగీతంలోనూ పాటల్నే వాడుకున్నారు దేవిశ్రీప్రసాద్. శ్యామ్‌దత్ ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్నిచ్చింది. ప్రతి ఫ్రేమ్ నాణ్యంగా ఉంటుంది. సముద్రంలో వచ్చే సన్నివేశాలు ఇంకా బాగుంటాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. మాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు చందూ మొండేటి కథలోని ప్రేమకోణంపై బలమైన ప్రభావం చూపించారు. మిగతా ఎమోషన్స్‌ని పర్వాలేదనిపించేలా డీల్ చేశారు. కానీ, ఇలాంటి ఓ కథని సినిమాటిక్ హంగులతో మలిచిన విధానం, అందుకు ఆయన చేసిన కసరత్తుల్ని మెచ్చుకోవాల్సిందే.
బలాలు
+ నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ
+ ప్రేమకథ, భావోద్వేగాలు
+ దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్యామ్‌దత్ విజువల్స్
బలహీనతలు
– నాటకీయంగా సాగే కొన్ని సన్నివేశాలు
చివరిగా: తండేల్… గురి తప్పలేదు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!