కొన్ని క్యాన్సర్ కణితులు ఇతర అవయవాలకూ విస్తరిస్తుంటాయి. అక్కడవి కొత్తగా క్యాన్సర్‌గా మారతాయి (మెటాస్టెసీస్). ప్రధాన కణితి నిరంతరం క్యాన్సర్ కణాలను రక్తంలోకి విడుదల చేయటం దీనికి బీజం వేస్తుంది.
రక్తంలో ప్రవహించే ఈ కణితి కణాలు చిన్న చిన్న గుచ్ఛాలుగా ఏర్పడి, ఇతర అవయవాల్లో స్థిరపడతాయి. ఇవి క్రమంగా పెద్ద కణితులుగా మారతాయి. ఇలాంటి క్యాన్సర్ల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. వీటిని ఎదుర్కోవటంలో ఈటీహెచ్ జ్యూరిచ్, యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ బేసల్ అండ్ జ్యూరిచ్, మేసల్ ల్యాండ్ కాంటోనల్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఇతర అవయవాల నుంచి రొమ్ములోకి వచ్చి స్థిరపడ్డ సముచ్ఛయాల్లోని క్యాన్సర్ కణాల సంఖ్య తగ్గటానికి ఫాక్స్‌గ్లవ్ అనే పువ్వుల నుంచి తీసిన డిజాక్సిన్ అనే మందు బాగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా ఇది క్యాన్సర్ తలెత్తే ప్రమాదం గణనీయంగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు గుర్తించారు. ‘ఇతర అవయవాల నుంచి వచ్చి రొమ్ములో క్యాన్సర్‌గా పరిణమించటమనేది కణాల గుచ్ఛాల సైజు మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌గా మారతాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ గుచ్ఛాల్లోని కణాలు విడిపోయేలా చేయటం ద్వారానే డిజాక్సిన్ పనిచేస్తోంది. ఇది కణితి కణాల మీది పొరలో సోడియం-పొటాషియం పంపులను అడ్డుకుంటుంది. దీంతో కణాలు క్యాల్షియంను ఎక్కువగా లోపలికి తీసుకుంటాయి. ఫలితంగా క్యాన్సర్ కణాలు ఒకదాంతో మరోటి అతుక్కునే సామర్థ్యం తగ్గుతుంది.
ఫలితంగా గుచ్ఛం నుంచి విడిపోతాయి. అయితే డిజాక్సిన్ ఒక్కటే కణితిని నిర్మూలించలేదు. క్యాన్సర్ కణాలు చనిపోవటానికి ఇతర మందులు అవసర మవుతాయి.
































