Navy Jobs: నేవీలో జాబ్స్.. సెలెక్ట్ అయితే ఫస్ట్ మంత్ నుంచే శాలరీ లక్ష

భారతీయ నౌకా దళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లలో ఈ పోస్టులు ఉన్నాయి.


అన్నీ లెవెల్ -10 హోదా ఉద్యోగాలే. ఈ పోస్టుల ప్రత్యేకత ఏమిటంటే పరీక్ష లేకుండా ఉద్యోగంలోకి తీసుకోవడమే. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుంది. అవివాహిత మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంటర్వ్యూలో పాస్ అయితే.. శిక్షణ ఇస్తారు. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సేలరీ ఎంత వస్తుందో తెలుసా.. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో మీరు సేలరీ పొందుతారు. మొదటి నెల నుంచే రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ ఇలా..
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. అయితే, ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత నియామకానికి ఖరారు చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నేవల్ అకాడెమీ, ఎజిమాళలో వచ్చే ఏడాది జనవరి నుంచి 22 వారాల పాటు సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మరో 22 వారాలపాటు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

విధుల్లో ఎన్నేళ్లు కొనసాగుతారంటే..
ప్రొబేషన్ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులు పరిమిత కాల ప్రాతిపదికన (షార్ట్ సర్వీస్ కమిషన్) ఉంటాయి. ఎంపికైన వారు పన్నెండేళ్లు విధుల్లో కొనసాగుతారు. ఆ తరువాత రెండేళ్లు సర్వీసు పొడగింపు ఉంటుంది. మొత్తంగా 14ఏళ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఆ తరువాత విధుల నుంచి వైదొలుగుతారు. ఉద్యోగంలో ప్రారంభం నుంచి మూల వేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. మొత్తంగా మొదటి నెల నుంచే రూ.1,10,000 జీతం అందుకోవచ్చు.

ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్ విభాగంలో జనరల్ సర్వీస్ లో 60ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచ్ లో బీఈ/బీటెక్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 22, పైలట్ 26 ఖాళీలకు బీఈ/బీటెక్ లో 60శాతం, టెన్త్, ఇంటర్ లోనూ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్ 28 ఖాళీలకు ఎందులోనైనా 60శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ (ఐటీ)/ఎంసీఏ, బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్/సప్లై చెయిన్ లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో అన్ని విభాగాల్లోనూ కలిపి 15 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివిన వారు అర్హులు.
టెక్నికల్ బ్రాంచ్ విభాగంలో ఇంజనీరింగ్ బ్రాంచ్ 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 45, నేవల్ కన్ స్ట్రక్టర్ 18 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే. బీఈ లేదా బీటెక్ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పైపోస్టులకూ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.