Pension Scheme: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్‌ అమలు!

ఏకీకృత పెన్షన్ స్కీం విషయంలో మోడీ సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం (NPS) కింద ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపికను అందించింది.


ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS కింద UPS ఎంపికను ఎంచుకోవచ్చు లేదా UPS ఎంపిక లేకుండా NPSతో కొనసాగవచ్చు.

జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ను ప్రవేశపెట్టింది. అయితే UPS కోసం జనవరి 24, 2025న కేంద్రం ప్రకటన చేయగా, ఇది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఈ పథకం ఇప్పటికే NPS కింద నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే. ఈ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌, యూపీఎస్‌ మధ్య ఎంచుకునే అవకాశం కలిగి ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రతను ప్లాన్ చేసుకోవడంలో వారికి మరింత సౌలభ్యాన్ని అందిస్తారు.

UPS ఎందుకు ప్రవేశపెట్టారు?

ఓపీఎస్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి చివరి జీతంలో 50 శాతం పెన్షన్‌గా అందించడంతో, పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) కోసం డిమాండ్ పెరుగుతోంది. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం యుపిఎస్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని నిర్ధారిస్తుంది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అంటే ఏమిటి?

యూపీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి గత 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన స్థిర పెన్షన్‌ను పొందుతారు. అయితే, అర్హత పొందాలంటే ఉద్యోగి కనీసం 25 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. ఒక ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగికి అర్హత ఉన్న పెన్షన్ మొత్తంలో 60 శాతం వారి కుటుంబానికి లభిస్తుంది. అదనంగా కనీసం 10 సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగులకు నెలకు రూ.10,000 కనీస హామీ పెన్షన్‌ను ఈ పథకం నిర్ధారిస్తుంది.

ఎప్పటి నుంచి NPS అమలు..

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం, NPS ప్రయోజనాలను కలిపి తాజాగా UPSని రూపొందించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో 50% పెన్షన్‌గా అందిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు భత్యం, కుటుంబ పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. NPS కింద వచ్చే ఉద్యోగులకు UPS ఎంచుకునే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా UPS కింద ప్రయోజనాలను అందిస్తారు.

యూపీఎస్‌ ప్రయోజనాలు:

యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది. ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్‌లో 60% అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీతో పాటు, ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది. ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే, అతనికి నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. యూపీఎస్‌ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవీ విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు, విధాన మార్పులు, ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు UPS, NPS మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్‌ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్‌ను ఎంచుకుంటే, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 90 లక్షలు కానుంది. యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో అమలు చేయబడుతుంది.

సగం జీతం పెన్షన్

ఏకీకృత పెన్షన్ పథకం కింద 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. పదవీ విరమణ తర్వాత అతనికి గత 12 నెలల సగటు జీతంలో సగం అంటే 50% ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు. అయితే ఒక ఉద్యోగి 25 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేస్తే, అతనికి తదనుగుణంగా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి కనీసం 10 సంవత్సరాలు పనిచేయడం అవసరం.

UPS కి ఎవరు అర్హులు?

ప్రభుత్వం జనవరి 25, 2025న అధికారికంగా UPSకి నోటిఫై చేసింది. ఇది ప్రస్తుతం NPS కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందని పేర్కొంది. UPSని ఎంచుకునే ఉద్యోగులు ఎటువంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలు లేదా విధాన మార్పులకు అర్హులు కారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 24, 2024న ఈ పథకాన్ని ప్రకటిస్తూ, ప్రభుత్వ సహకారాలకు సంబంధించిన కీలక వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత NPS కింద, ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 10 శాతం, ప్రభుత్వం 14 శాతం వాటా చెల్లిస్తారు. అయితే కొత్త UPS వ్యవస్థ ప్రకారం, ప్రభుత్వ సహకారం 2025 ఏప్రిల్ 1 నుండి ఉద్యోగి ప్రాథమిక జీతంలో 18.5 శాతానికి పెరుగుతుంది.

ప్రభుత్వ నిధుల పెరుగుదల వల్ల మొదటి సంవత్సరంలో కేంద్ర ఖజానాపై రూ.6,250 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. యుపిఎస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని, పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుందని, పాత ఓపిఎస్ మోడల్ మాదిరిగానే పెన్షన్ వ్యవస్థ కోసం డిమాండ్లను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.