Spam Calls : స్పామ్ కాల్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా ఫుల్ స్టాప్ పెట్టేయండి

Spam Calls : ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్ బెడద తీవ్రతరం అయింది. ఏదో పనిలో బిజీగా ఉన్న సమయంలో పదే పదే వచ్చే స్పామ్ కాల్స్‌తో కొందరు చికాకు పడుతుంటారు.


వీటి నుంచి తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే చాలు ఇక మీదట ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్లు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు ముందుగా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్‌లో తమ ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి. ఇందులో రిజిస్టరై ఉన్న నెంబర్లకు టెలీ మార్కెటింగ్ కాల్స్ అయితే రావు.

స్పామ్ కాల్స్ అనేవి ప్రతి మొబైల్ ఫోన్ యూజర్ ఎదుర్కొనే సమస్య. మనం ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్న సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది. ముఖ్యమైన కాల్ అయి ఉంటుందని ఫోన్ ఎత్తినప్పుడు, అది కస్టమర్ కేర్ నుండి వచ్చినట్లు అర్థం అవుతుంది. మనలో చాలా మంది ఈ అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటాం. ఎక్కడో లోన్ గురించి తెలుసుకునేందుకు మనం ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తాం.. లేదా ఫ్లాట్ కొనడానికి ఆన్‌లైన్‌లో ఎంక్వైరీ చేస్తాం. లోన్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతాం. దానిని ఆధారంగా చేసుకుని మనకు రోజుకు పది కాల్స్ వస్తాయి. వివిధ కంపెనీల నుండి స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మన అవసరం అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే, ఈ బాధించే స్పామ్ కాల్స్‌ను మనం సాధారణ చిట్కాలతో తనిఖీ చేయవచ్చు, కాబట్టి స్పామ్ కాల్స్‌ను ఎలా ఆపాలి? ఇప్పుడు దీని కోసం ఏ చిట్కాలను అనుసరించాలో ఈ కథనంలో చూద్దాం.

SMS ద్వారా స్పామ్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం, ముందుగా ఫోన్‌లోని మెసేజ్ ఓపెన్ చేసి.. 1909 నంబర్‌కు ‘FULLY BLOLK’ అనే మెసేజ్ పంపండి. మీకు వెంటనే మరొక మెసేజ్ వస్తుంది. అందులో, మీరు మీ వ్యక్తిగత నంబర్‌ను నమోదు చేసి, మీకు ఎలాంటి కాల్స్ వద్దు అనే దాని గురించి సమాచారాన్ని అందించాలి. దీనితో స్పామ్ కాల్స్ 24 గంటల్లోపు ఆగిపోతాయి. జియో కస్టమర్లకు స్పామ్ కాల్స్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీని కోసం, ముందుగా ఫోన్‌లో ‘మై జియో’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను తెరిచి సెట్టింగ్‌లకు వెళ్లండి. తర్వాత సర్వీస్ సెట్టింగ్‌లలో డూ నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కేటగిరీలో, మీరు DND సర్వీస్‌ను యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా లేదా అని సెలక్ట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి.

అదే ఎయిర్‌టెల్ యూజర్ అయితే.. ముందుగా airtel.in/airtel-dnd కి వెళ్లాలి. తర్వాత వెబ్‌సైట్‌లో ముందుగా మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను సెలక్ట్ చేసుకోవాలి. Vodafone Idea నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంటే.. ముందుగా Discover.vodafone.in/dnd కి వెళ్లండి. తర్వాత మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పేరును ఎంటర్ చేయండి. తర్వాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను ఎంచుకుని, ఓకే బటన్ పై క్లిక్ చేయండి. దీనితో పాటు, ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్‌లో ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్‌లకు వెళ్లాలి. తర్వాత, కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్‌పై క్లిక్ చేయడం వల్ల ఫోన్‌లో కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతాయి. దీంతో మీకు స్పామ్ మెసేజ్ లు, కాల్స్ రావు.