పోస్టాఫీసులో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. సరికొత్త పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నాయి.
అయితే పోస్టాఫీస్ పథకాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకొని.. పెట్టుబడుల్ని పెట్టేవారి కోసం ప్రస్తుతం ఎన్నో చిన్న మొత్తాల పొదుపు పథకాలు అమలు చేస్తున్నాయి పోస్టాఫీసులు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండటంతో ఇందులో ఉండే డిపాజిట్లకు ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటి ఉంటుందన్న నమ్మకం ఉంటుంది. అలాగే ఇందులో అమలు అయ్యే పథకాలకు నిర్ధష్ట వడ్డీ రేటు ప్రకారం గ్యారెంటీ రిటర్న్స్‌కు అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. అక్కడ రిస్క్ ఉంటుందని చెప్పవచ్చు. కానీ పోస్టాఫీసులో అయితే ఎలాంటి రిస్క్ ఉండదు.
దేశంలో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో డిమాండ్ ఉన్న పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్. ఇలాంటి పథకాల్లో ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. పీపీఎఫ్ వడ్డీ రేటు చాలా కాలంగా స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇందులో వార్షిక ప్రాతిపదికన 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం అసలుకు వడ్డీ కలిసి.. మళ్లీ దానిపై వడ్డీ వస్తుంది. దీనినే చక్రవడ్డీ అంటారు. దీంతో భారీ రిటర్న్స్ ఉంటుంది.
రూ.500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు:
ఈ స్కీమ్‌లో రూ.500 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే భారతీయులకు మాత్రమే అర్హత ఉంటుంది. దేశంలో పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన బ్యాంకుల్లో అకౌంట్ తీయవచ్చు.
పన్ను మినహాయింపు:
ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రతి నెలా వడ్డీ లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివర్లో జమ చేస్తారు. ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం కింద వడ్డీ కూడా టాక్స్ ఫ్రీ ఉంటంది. పెట్టుబడుల మీద, వడ్డీ ఆదాయం మీద, మెచ్యూరిటీ రిటర్న్స్ మీద ఎలాంటి పన్ను ఉండదని గుర్తించుకోండి.
ఇందులో వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అకౌంట్ తెరిచిన ఐదేళ్ల తర్వాత క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌పై రిటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
ఉదాహరణకు ఇక్కడ నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.12 వేలు అవుతుంది. మెచ్యూరిటీకి 15 ఏళ్లకు మీ రూ.1.80 లక్షల పెట్టుబడిపై రూ. 1.45 లక్షలకుపైగా వడ్డీ వస్తుంది. ఇదే 20 ఏళ్లకు అయితే రూ.5.32 లక్షలు వస్తాయి. ఇక నెలకు రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.60 వేలు అవుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ.9 లక్షలు అవుతుంది. దీనిపై రూ.7.27 లక్షల వడ్డీ వస్తుంది. మరో ఐదేళ్లు పొడించినట్లయితే అంటే 20 ఏళ్లకు అయితే మొత్తం మీ చేతికి రూ.26.63 లక్షలు వస్తాయి. ఇదే 25 ఏళ్లకు అయితే రూ. 41 లక్షలకుపైగా పొందే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవాలంటే మీ మెచ్యూరిటీ పెంచుకోవడంపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
నెలకు రూ. 10 వేల చొప్పున ఏటా రూ. 1.20 లక్షల పెట్టుబడిపై చూస్తే 15 ఏళ్లలో రూ. 32 లక్షలు పొందవచ్చు.ఇదే 20 ఏళ్లకు రూ. 53,26,631, 25 ఏళ్లకు రూ. 82,46,412 వస్తుంది. ఇక నెలకు రూ. 12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏటా రూ. 1.50 లక్షల గరిష్ట పెట్టుబడిపై 15 ఏళ్లకు రూ. 40 లక్షలు అవుతుంది. అదే 20 ఏళ్లకు రూ.66 లక్షలు, 25 సంవత్సరాలకు ఏకంగా రూ. 1.03 కోట్లు అందుకుంటారు.
PPF ఖాతాను తెరవడానికి కనీస పెట్టుబడి మొత్తం రూ.500.
ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా పెట్టుబడి పెట్టగల మొత్తం రూ.1.5 లక్షలు.
పీపీఎఫ్ ఖాతాలు పన్ను రహిత డిపాజిట్లు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తాయి.
ఈ స్కీమ్ కోసం ఖాతా పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారా తెరవవచ్చు.
పీపీఎఫ్ ఖాతాలను 5 సంవత్సరాల నుంచి పొడిగించవచ్చు.
పీపీఎఫ్‌ను ఉపయోగించి రుణాలు పొందవచ్చు.