ఏపీలో ఇకపై అలాంటి వారి పని ఖతమే.. రంగంలోకి స్పెషల్‌ టీమ్స్‌

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన యూట్యూబర్ల లెక్కలు తేలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇందుకోసం స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. చట్టరీత్యా నేరం అయినా.. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారి లెక్క తెల్చేందుకు సిద్ధమయ్యారు ఏపీ పోలీసులు.. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోనున్నారు.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పేరిట ఇంతకాలం రెచ్చిపోయారు.. ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా ఇంతకాలం నడిచింది.. ఫాలోవర్స్ పెరగడంతో రెచ్చిపోయారు.. చట్టరీత్యా నేరం అయినా.. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.. అయితే.. అలాంటి వారికి ఏపీ సర్కార్ ఝలక్ ఇచ్చింది.. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని తన సొంత ప్రయోజనాల కోసం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. లోకల్ బాయ్ నాని ప్రమోషన్స్‌పై AYIF యూత్‌ వింగ్‌ విశాఖ సీపీ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి.. చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నానిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. అయితే.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మరి కొంత మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొందమంది యూట్యూబర్స్‌.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ… యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్‌లలో నష్టపోయి సూసైడ్స్‌ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిని గుర్తించేందుకు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. ఎవరెవరు ఇప్పటివరకు ప్రమోట్ చేశారు.. అనే వివరాలను సేకరిస్తున్నారు. ఎవరైనా యూట్యూబర్లు ఇన్‌ఫ్లూయెన్సర్లు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్ లైన్ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నారు.