మీరు ఆ పోస్టు తీసుకుంటారా ? పవన్ కు వైసీపీ ఘాటు కౌంటర్ ..!

ఏపీలో వైఎస్ జగన్ కు విపక్ష నేత హోదా ఇవ్వాలన్న వైసీపీ డిమాండ్ నేపథ్యంలో నిన్న దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ అది సాధ్యం కాదని, జర్మనీ వెళ్లి అక్కడ తీసుకోవాలంటూ సెటైర్లు వేశారు.


ఈ నేపథ్యంలో వైసీపీ ఇవాళ స్పందించింది. రాష్ట్రంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీల్లో టీడీపీ తర్వాత రెండో స్ధానంలో ఉన్న జనసేనకు విపక్ష హోదా అడిగే హక్కు ఉందంటూ పవన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చింది.

ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే పక్షంగా వైయస్ఆర్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అర్థంలేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమయం ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశంతోనే వైయస్ఆర్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైయస్ జగన్ కోరుతున్నారని, దీనివల్ల ప్రత్యేకంగా వచ్చే హంగూ ఆర్భాటం ఏమీ లేదన్నారు. మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు తమ పాలనలోని వైఫల్యాలను వారే సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ఏ సభకైనా సార్థకత లభిస్తుందని, పాలనలోని మంచిచెడులను ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ద్వారా ప్రజాగళంను సభలో వినిపించడం ప్రతిపక్షం బాధ్యత అని సతీష్ రెడ్డి తెలిపారు.

ప్రతిపక్షంగా గుర్తించాలన్న వైయస్ఆర్సీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా స్పందించడం దారుణం అని సతీష్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో జనసేన రెండో అతిపెద్ద పార్టీగా ఉందని, ప్రతిపక్షంగా గుర్తించాల్సి వస్తే తమకే అవకాశం ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, తమకే ప్రతిపక్షం దక్కుతుందని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.