రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన పోస్ట్

Andhra Pradesh Budget 2025 | అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి (GV Reddy) ఏపీ సీఎం చంద్రబాబుపై, ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వంపై తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


నా జీవితంలో ఆ విషయాన్ని మరిచిపోలేను..

‘కూటమి ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ బడ్జెట్ రూ. 3 లక్షల 22 వేల కోట్లతో ప్రణాళికబద్ధంగా రూపొందించారు. కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ రూపొందించడం విశేషం. నేను (జీవీ రెడ్డి) నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు (Chandrababu) నాయకత్వంపై ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయి. తక్కువ కాలంలోనే అటు టీడీపీ లోనూ, ఇటు ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడాన్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ మా సార్ చంద్రబాబు రుణపడి ఉంటాను.’ అని జీవీ రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని జీవీ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీ పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవాలి. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనే కోరుకోవడం తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి తన పోస్టులో రాసుకొచ్చారు. టీడీపీకి సైతం రాజీనామా చేసిన జీవీ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారని, మంచి వ్యక్తి సేవల్ని కోల్పోతున్నామంటూ సోషల్ మీడియాలో ఆయనకు భారీ మద్దతు లభించింది. ఈ క్రమంలో జీవీ రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించి గౌరవించిన చంద్రబాబుకు ధన్యవాదాల తెలుపుతూ ఏపీ బడ్జెట్ ను ప్రశంసించారు.

అసలేం జరిగింది..
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా కొన్ని రోజుల కిందట జీవీ రెడ్డి సంచలనానికి తెరతీశారు. ఫైబర్నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా కాపాడారని జీవీ రెడ్డి ఆరోపించారు. ఏకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలు చెప్పడం ఏపీలో దుమారం రేపింది. అన్ని విషయాలు గమనించిన తాను 410 మంది ఉద్యోగుల్ని తీసేయమని సూచించినా, ఇంకా వారికి జీతాలిస్తున్నారని చెప్పారు. అలా వృథా చేస్తున్న నగదును ఫైబర్ నెట్ ఎండీ దినేష్ దగ్గర నుంచి వసూలు చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దినేష్ పేషీలో పని చేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల్నించి తొలగించారు.

ఈ వ్యాఖ్యల అనంతరం ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని పిలిపించి క్లాస్ పీకారని ప్రచారం జరిగింది. ఐఏఎస్ అధికారులు తమది పైచేయి కావాలని భావిస్తారని, వారితో పని అంత ఈజీ కాదని.. నేరుగా ఆరోపణలు చేయడానికి బదులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని, వాటికి సంబంధించి ఫైళ్లు బయటకు తీస్తున్న తనకు జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. దాందో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. ఫైబర్ నెట్ ఎండీ బదిలీ
జీవీ రెడ్డి అటు టీడీపీకి, ఇటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవులకు రాజీనామా చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీని దినేష్పై బదిలీ వేటు వేసింది. ఆర్టీజీఎస్, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ల బాధ్యతల నుంచి సైతం దినేష్ ను తప్పించింది. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని దినేష్ను ఆదేశించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.