Gold Import Duty: భారతీయులు అంటేనే పసిడి ప్రియులు. చాలా కాలంగా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరల పెరుగుదల కొంత నిరుత్సాహానికి గురిచేస్తోంది.
అయితే దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నేడు గట్టి షాక్ ఇచ్చింది.
బంగారం, వెండి ఉండే వాటితోపాటు విలువైన లోహాలతో తయారు చేసిన నాణేలపై దిగుమతి సుంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ప్రకటన ద్వారా కొత్త దిగుమతి డ్యూటీ రేటు 15 శాతానికి పెంచబడింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ ఉండగా.. మిగిలిన 5 శాతం ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్(AIDC) కింద వసూలు చేయబడుతుంది. అయితే ఈ పెంపు సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జ్(SWS) మినహాయింపుకు వర్తించదు.
ఇదే క్రమంలో విలువైన లోహాలను కలిగి ఉన్న వ్యర్థ ఉత్ప్రేరకాలపై దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. కొత్త డ్యూటీ రేటు 14.35 శాతంగా ప్రకటించగా.. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ కింద అదనంగా 4.35% ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ నుంచి మినహాయింపు ఉంది. ఈ రేట్లు జనవరి 22, 2024 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకోబడిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నేటి ధరలను పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,050గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీ రూ.77,000గా కొనసాగుతోంది.