భారతీయులు విదేశీ ప్రయాణాలు చేయాలంటే కచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. భారత పౌరులందరికీ పాస్పోర్ట్ పొందడానికి అర్హతలు ఉన్నా పాస్పోర్ట్ కావాలంటే నిర్దిష్ట నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే తాజాగా పాస్పోర్ట్ నియమాలను సవరించారు. ఇకపై పాస్పోర్ట్ కావాలంటే కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి సమర్పించాల్సి ఉంటుంది.
జనన మరణాల నమోదు చట్టం, 2023 ప్రకారం అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన పౌరులందరూ ఇప్పుడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు జనన తేదీకి రుజువుగా వారి జనన ధృవీకరణ పత్రాన్ని కచ్చితంగా జతచేయాల్సి ఉంటుంది.
అయితే ఈ కటాఫ్ తేదీకి ముందు జన్మించిన వారు ఏయే పత్రాలు జనన ధ్రువీకరణ పత్రంగా సమర్పించాలో? కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఇటీవల ఓ గెజిట్ను విడుదల చేసింది. పాస్పోర్ట్ సవరణ నియమాలు-2025 ప్రకారం జనన రుజువుగా ప్రత్యామ్నాయ పత్రాలను సమర్పించవచ్చు.
ఆ పత్రాలు ఇవే
పాఠశాలలు జారీ చేసే టీసీతో పాటు మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
పాన్ కార్డు
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సర్వీస్ రికార్డ్ లేదా పే పెన్షన్ ఆర్డర్
డ్రైవింగ్ లైసెన్స్
ఓటు గుర్తింపు కార్డు
ఎల్ఐసీ లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన పాలసీ బాండ్.
గతంలో కూడా, జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించడానికి కటాఫ్ తేదీని నిర్ణయించారు . దాన్ని జనవరి 26, 1989గా పేర్కొన్నారు. అయితే 2016లో ఈ నిబంధనను తొలగించారు. దరఖాస్తుదారులందరూ తమ పాస్పోర్ట్ దరఖాస్తుతో పైన జాబితా చేయబడిన పత్రాలలో దేనినైనా జనన రుజువుగా జతచేయడానికి వీలుగా పాస్పోర్ట్ నియమాలు సవరించారు.
































