హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించే తీర్థయాత్రల్లో కొన్ని సాహసోపేతమైన యాత్రలు. ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో కొలువైన అమర్‌నాథ్, కేదార్‌నాథ్, కైలాస్ – మానస సరోవర్ వంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
వీటిలో అధిక సంఖ్యలో యాత్రికులు సందర్శించేవాటిలో చార్‌ధామ్‌గా పేరొందిన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు ముఖ్యమైనవి. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో చార్‌ధామ్ యాత్ర చేస్తుంటారు. ఈ నాలుగు ధామ్‌లలో గంగోత్రి, బద్రీనాథ్ వరకు నేరుగా వాహనాల్లో చేరుకునే అవకాశం ఉంది. కానీ యమునోత్రి, కేదార్‌నాథ్ క్షేత్రాలకు చేరుకోవాలంటే నేరుగా రోడ్డు మార్గం లేదు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన “కేదార్‌నాథ్”కు వెళ్లాలంటే.. యాత్రికులు ‘గౌరీకుండ్’ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుని, అక్కణ్ణుంచి ఎత్తైన హిమగిరుల అంచు మీదుగా నడక సాగించాల్సి ఉంటుంది. గుప్తకాశీ సమీపంలోని ఫటా నుంచి హెలీకాప్టర్ సదుపాయం ఉన్నప్పటికీ.. వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందుకే అత్యధిక సంఖ్యలో కాలి నడకన, కొందరు గుర్రాలు లేదా పల్లకీల సహాయంతో కేదార్‌నాథ్ చేరుకుని ఆ పరమశివుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఇందులో ఏ మార్గమైనా ప్రమాదాలతో కూడుకున్నదే. కాలినడకన వెళ్లే మార్గం పూర్తిగా పర్వతాల అంచు మీదుగా ఉంటుంది కాబట్టి.. జారి లోయల్లోకి, నదుల్లోకి పడిపోయే ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఏ క్షణంలో ఎలా మారుతుందో తెలియని వాతావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి కాబట్టి హెలీకాప్టర్ ప్రయాణాల్లో అనేక సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాగని సముద్ర మట్టానికి 3,583 మీటర్లు (11,968 అడుగులు) ఎత్తున ఉన్న కేదార్‌నాథ్‌కు రోడ్డు మార్గం నిర్మించడం కూడా చాలా కష్టతరం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టింది. కాలినడక శ్రమను తప్పిస్తూ భారీ రోప్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బుధవారం (మార్చి 5) నాడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్ క్షేత్రాలకు భారీ రోప్ వే ప్రాజెక్టులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
మందాకిని నది వెంట రోప్ వే
కేదార్‌నాథ్ ఆలయం వెనుకాల ఉన్న హిమానీనదాల నుంచి జన్మించిన మందాకినీ నది 2013లో సృష్టించిన విళయం వేల సంఖ్యలో యాత్రికులను బలి తీసుకుంది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరద ముంచెత్తి నదీ తీరాన ఉన్న గ్రామాలకు గ్రామాలనే తనలో కలిపేసుకుని చరిత్రలోనే అతి పెద్ద విషాదాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం కేదార్‌నాథ్ చేరుకోవాలంటే ఆ నదిని ఆనుకుని ఉన్న పర్వత శిఖరాల అంచుల మీదుగానే నడక సాగించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే రోప్ వే ప్రాజెక్టు కూడా ఆ నదికి సమాంతరంగా సగం దూరం ఎడమవైపు, మిగతా సగం కుడివైపుగా సాగేలా నిర్మాణం జరుపుకోనుంది. సోన్‌ప్రయాగ్ నుంచి మొత్తం 12.9 కి.మీ పొడవుతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
“పర్వతమాల పరియోజన” పేరుతో పర్వత ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర సర్కారు సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నేతృత్వంలో “నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML)” సంస్థను ఏర్పాటు చేసి, ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్‌తో కలిసి ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ. 4,081 కోట్లు ఖర్చు చేయనుంది. దీన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) విధానంలో నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రకారం నిర్మాణ సంస్థ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత 35 ఏళ్ల పాటు నిర్వహించి, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. నిర్వహణ కోసం యాత్రికుల నుంచి వసూలు చేసే రుసుము ద్వారా నిర్మాణ వ్యయాన్ని, ఆపై నిర్వహణ ఖర్చులు, లాభాలను గడించవచ్చు. అయితే నిర్మాణ సంస్థలు రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో లాభాపేక్షలేకుండా తక్కువ ఖర్చుతో ప్రయాణానానికి వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టును 6 ఏళ్లలోగా పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా యాత్రికులకు నడక శ్రమ తప్పడమే కాదు, ప్రయాణ సమయం సైతం పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. సాధారణంగా గౌరీకుండ్ నుంచి నడక మార్గంలో కేదార్‌నాథ్ చేరుకోడానికి 8-10 గంటల సమయం పడుతుంది. అదే ఇప్పుడు గౌరీకుండ్ కంటే 6 కి.మీ ముందే ఉన్న సోన్‌ప్రయాగ్ నుంచి 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ చేరుకోవచ్చు. ఒక డైరెక్షన్లో ఏకకాలంలో 1,800 మందిని తీసుకెళ్లే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.
వీటన్నింటి కంటే హెలీకాప్టర్, రోడ్ ప్రయాణాల్లో శిలాజ ఇంధనాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా ఈ రోప్ వే ద్వారా నివారించవచ్చు. ఇది పూర్తిగా విద్యుత్ శక్తి ఆధారంగా నడుస్తుంది కాబట్టి పర్యావరణానికి నష్టం కలిగించే ఎలాంటి కర్బన ఉద్గారాలు ఉండవు. నడవాల్సిన శ్రమ లేకపోవడంతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులకు ఈ రోప్ వే ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఇదే మాదిరిగా హిమాలయాల్లో కొలువైన సిక్కు మతస్థుల పవిత్ర క్షేత్రం హేమ్‌కుండ్ సాహిబ్ చేరుకోడానికి కూడా కేంద్ర మంత్రివర్గం రోప్ వే ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. రూ. 2,730 కోట్ల ఖర్చుతో 12.4 కి.మీ పొడవున ఈ రోప్ వే నిర్మాణం జరగనుంది.