సుప్రీంకోర్టులో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. సనాతన ధర్మం వ్యాఖ్యలపై కొత్త కేసులను నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉదయనిధికి ఉపశమనం లభించింది. తదుపరి చర్యలకు కోర్టు అనుమతి అవసరం అని సుప్రీం ధర్మాసనం గురువారం పేర్కొంది.
సనాతన ధర్మం వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కేసులు నమోదు చేయొద్దని. అంతేకాకుండా చర్యలు తీసుకునే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది.
2023, సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని… డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అయితే తన వ్యాఖ్యలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదని.. సామాజిక అన్యాయాలను ప్రశ్నించడానికేనని ఉదయనిధి తెలిపారు.
స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్లతో పాటు.. బీహార్‌లో కొత్తగా కేసు నమోదైందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ.. కొత్త కేసులు నమోదు చేయొద్దని సూచించింది. ఇక కేసులను తమిళనాడుకు కాకపోయినా.. కర్ణాటకకు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని సింఘ్వి కోరారు. ఉదయనిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా లేవని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది.
































