పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచి బరువును తగ్గించేందుకు విద్యాశాఖ సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై 1-9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా పాఠ్యపుస్తకాలు అందించనుంది. మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను జూన్‌లో.. బడులు తెరిచిన సమయంలో ఇవ్వనుండగా, తర్వాత రెండో సెమిస్టర్‌వి అందజేస్తారు. ఒకటి నుంచి రెండో తరగతి వరకు రెండు చొప్పున పుస్తకాలే ఉంటాయి. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు కలిపి ఆరు ఉండగా.. వాటిని రెండు చేశారు. తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా.. వీటికి సంబంధించిన వర్క్‌బుక్‌లు మరొకటి ఉంటాయి.
వీటిని రెండు సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు. మూడు, నాలుగు, ఐదు తరగతులకు నాలుగు పాఠ్యపుస్తకాల చొప్పున ఉంటాయి. తెలుగు, ఆంగ్లం కలిపి ఒకటి.. గణితం, ఈవీఎస్ మరొకటి.. వీటి వర్క్‌బుక్‌లను మరో రెండుగా తీసుకొచ్చారు. ఆరు నుంచి తొమ్మిదోతరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ ఒకే పుస్తకంగా ఉంటాయి. మిగతావి విడివిడిగా ఇస్తారు. సెమిస్టర్ పాఠాలే ఉన్నందున పుస్తకాల సైజు బాగా తగ్గింది. ఉన్నత తరగతుల్లో భాష పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా ఉండటంతో బరువు చాలావరకు తగ్గింది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో అధికారులు సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు.
ఏపీ మోడల్ విద్య..
ఏపీ మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లల ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో రాజకీయ నేతలు, సీఎం, మంత్రుల ఫొటోలు లేకుండా ఇవ్వాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తోంది.
ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఆన్‌లైన్ చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తూ తుది సీనియారిటీ జాబితాను రూపొందించనుంది. భవిష్యత్తులో పదోన్నతులు, బదిలీలకు ఇదే ప్రామాణికంగా ఉంటుంది.
ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో 10 వేల వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వచ్చే ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను తీసుకొస్తోంది. విద్యార్థులు అటు ఇంజినీరింగ్ ఇటు వైద్య విద్యకు అర్హత సాధించేలా ఎంబైపీసీని ప్రవేశ పెట్టబోతోంది.

































