మూడు విమానాలు, 14 నిమిషాల గడువు ఉత్కంఠ రేపిన నామినేషన్

Nomination Tension: మరో 14 నిమిషాల్లో ముగియనున్న గడువు. ఏకంగా మూడు ప్రత్యేక విమానాలు. ఒక్క వ్యక్తి నామినేషన్ కోసం ఇంత హంగామా. రాజు తలచుకుంటే అన్నట్టు కేంద్రమే తలచుకుంటే ఏర్పాట్లకు కొదవేముంటుంది.


అత్యంత కాస్ట్ లీ నామినేషన్‌గా ఖ్యాతికెక్కింది. అసలేం జరిగింది..

ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా మూడింట్లో తెలుగుదేశం అభ్యర్ధులు ఉన్నారు. మరో స్థానాన్ని బీజేపీకు కేటాయించారు. బీజేపీ అధిష్టానం ఈ స్థానాన్ని చివరి నిమిషంలో సోము వీర్రాజుకు కేటాయించింది. అంటే నామినేషన్ దాఖలు చివరి రోజు. బీ ఫారం పత్రాలు కావాలి. వాటిపై సంతకాలు కావాలి. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి కావాలి. మూడూ మూడు చోట్ల ఉన్నాయి. అన్నింటినీ అసెంబ్లీకు చేర్చాలి. నామినేషన్ పత్రాలు ఓ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరాయి. నామినేషన్‌పై సంతకాలు పెట్టే వ్యక్తి మరో ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి మరో విమానంలో చేరారు. మొత్తం మూడు విమానాల కధ ఇది.

అసలేం జరిగింది

చివరి నిమిషంలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో హడావిడిగా నామినేషన్ దాఖలు చేయాలి. పార్టీ తరపున అందాల్సిన బీ ఫారం పత్రాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ బీజేపీ కార్యాలయం నుంచి వాటిని తరలించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకాలు చేసిన ఫారాలు అవి. తెలంగాణ పార్టీ కార్యాలయం ఇన్‌ఛార్జ్ టీవీఎస్ రాజు ప్రత్యేక విమానంలో ఆ పత్రాలు తీసుకుని గన్నవరం చేరుకున్నారు. అయితే వీటిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సంతకాలు కావాలి. ఆమె ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించి పార్టీ కేంద్ర కార్యాలయం ఆమెతో పాటు ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు ఆథరైజేషన్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి గన్నవరం తరలించిన పత్రాల్ని తీసుకోవాలని కాశీ విశ్వనాథరాజుకు చెప్పారు. ఏలూరు ధర్నాకు వెళ్తున్న ఆయన మధ్యలో దారి మళ్లించి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని పత్రాలు తీసుకుని అసెంబ్లీకు చేరుకున్నారు.

ఈలోగా ఇతర సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేశారు. ఇక రాజమండ్రిలో ఉన్న సోము వీర్రాజు రోడ్డు మార్గంలో అలస్యం అవుతుందని భావించి విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఢిల్లీ, రాజమండ్రి, హైదరాబాద్ నుంచి మూడు విమానాలు గన్నవరం చేరితేనే కానీ సోము వీర్రాజు నామినేషన్ సాధ్యం కాలేదు. అది కూడా గడువు మరో 14 నిమిషాల్లో ముగుస్తుందనగా.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.