ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ పరీక్షకు నోటిఫికేషన్ (AP Polycet Exam Notification) విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 15 లోపు లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS), ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ఇతర పరీక్షలకు చెందిన అభ్యర్థులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సహా అన్ని సబ్జెక్టులలో కనీసం 35 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
దరఖాస్తు చేసుకునేందుకు ఓసీ, బీసీ విద్యార్థులైతే రూ.400.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఫలితాలు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, నెగిటివ్ మార్కులు లేవు.
దరఖాస్తు ఎలా చేయాలంటే ?
పాలీసెట్‌కు దరఖాస్తును ఆన్లైన్లో చేసుకోవాలి. మొబైల్ నెంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ (https://polycetap.nic.in/mob.aspx) ద్వారా.. లేదా పదో తరగతి హాల్‌టిక్కెట్ నెంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ (https://polycetap.nic.in/hall.aspx) ను ఉపయోగించాలి.
లింక్ ఓపెన్ చేసిన తర్వాత పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్, పదో తరగతి పాస్ అయిన సంవత్సరం, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆ తరువాత స్కూల్ రికార్డ్‌ల్లో ఉన్న విధంగానే పేరును నమోదు చేయాలి. ఆ తరువాత తండ్రి పేరు ఇవ్వాలి. మళ్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆ తరువాత హౌస్ నెంబర్, విలేజ్/ స్ట్రీట్, మండలం/ టౌన్ / సీటీ, జిల్లా, పిన్ కోడ్, మొబైల్ నెంబర్‌తో కూడిన పూర్తి అడ్రస్‌ను ఇవ్వాలి.
ఆ తరువాత ఎగ్జామ్ సెంటర్‌ను ఎంపిక (ప్రిఫరెన్స్) చేసుకోవాలి. ఆ తరువాత ఏరియా కోడ్ ఇవ్వాలి. రిజర్వేషన్ కేటగిరీ (బీసీ, ఎస్సీ, ఎస్టీ) ఇవ్వాలి. ప్రత్యేక కేటగిరీ ఉంటే (సీఏపీ, ఎస్పీ, పీహెచ్, ఎన్సీసీ) వాటిని కూడా పొందు పరచాలి. మైనార్టీలైతే వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉర్దూ మీడియా ఎగ్జామ్ సెంటర్ల (గుంటూరు, నంద్యాల)కు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.