PM Kisan: రైతులకు బిగ్ షాక్.. వారికి పీఎం కిసాన్ రద్దు

PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6వేల పెట్టుబడి సాయం పొందుతున్నారు. అయితే రాను రాను ఈ స్కీముపై కఠిన నియమాలు అమలు అవుతున్నాయి.


దాంతో అర్హత లేని రైతుల పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2025న బీహార్ లోని భాగల్ పూర్ లో ప్రధాని నరేంద్రమోదీ 19వ విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8కోట్ల మంది రైతుల అకౌంట్లోకి రూ. 22,000కోట్లు జమ చేశారు. కొందరు రైతులు అర్హత లేకపోవడంతోపాటు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకింగ్ సమస్యలు, లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు పొందలేకపోయారని అధికారులు తెలిపారు. ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

పీఎం కిసాన్ యోజనలోని కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు ఈ అనర్హుల జాబితాలో ఉన్నారు.

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రైతులు తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏపీలో కూడా ఇలాంటి సమస్యలు నమోదు అవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు pmkisan.gov.in వెబ్ సైట్లో తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. తమ ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయశాఖ కార్యాలయాలు సంప్రదించడం ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

20వ విడత జూన్ 2025లో విడుదల కానుంది. ఈ సారి అర్హత కోల్పోయిన రైతులు తమ వివరాలను సరిచేసుకుని తర్వాత విడత కోసం సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ స్కీము ద్వారా ఇప్పటి వరకు రూ. 3.68లక్షల కోట్లు 11కోట్ల మంది రైతులకు చేరాయని..ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ స్కీము కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2000 చొప్పున ఏడాదికి మొత్తం రూ. 6000 అందిస్తారు. ఈ డబ్బును రైతులు వ్యవసాయ అవసరాలకు కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ స్కీము ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారు. ఈ స్కీము రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుదని ప్రభుత్వం భావిస్తోంది.