జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా?

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. దీంతో షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓ వైపు మందులు వాడుతూనే.. మరోవైపు ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఇందుకోసం మనలో చాలా మంది జొన్న రొట్టెలను తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? నిజంగానే జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం.


“వరి బియ్యం తినేవారిలో త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. గోధుమలను తీసుకున్నా షుగర్ లెవల్స్ అలానే ఉంటాయి. కానీ, అదే సమయంలో జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ ఏది తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు. అయితే, వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయులు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.”

కానీ, ఆహారపు అలవాట్ల ఆధారంగా వీటిని తీసుకోవాలని డాక్టర్ పీవీ రావు సూచిస్తున్నారు. అలవాటు లేని పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండానే కాలేయంలోకి చేరిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా ఫ్యాటీ లివర్ లాంటి జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. ఇలా అనవసరంగా ప్రయోగాలు చేసి.. అలవాటు లేని పదార్థాలు తీసుకుని ఇబ్బందులు పడవద్దని సలహా ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా షుగర్​ తగ్గినా.. దీర్ఘకాలంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. అందుకే ఈ ఆహార ప్రయోగాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నారు.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అంటే?
మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్‌ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంత మేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్‌ అని పిలుస్తుంటారు. ఇలా మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అని, 56-69 మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌గా పేర్కొంటారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.