ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి ఉచిత విద్యుత్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయం ప్రకారం.. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీనివల్ల చేనేత రంగంలో కొనసాగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమం కానుంది.
అలాగే రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి నియంత్రణ చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ చట్ట సవరణ ద్వారా ఉపాధ్యాయుల బదిలీలు మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలు కలిగేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నూతనంగా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెరిగి, శుద్ధమైన విద్యుత్ వినియోగానికి అవకాశం కలుగుతుంది.
అదనంగా రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం అమలుతో రాజధాని అభివృద్ధికి మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. అలాగే YSR తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది స్థానిక ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వారి అభీష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది.