ఏ విటమిన్ల లోపం ఉంటే మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగాలు రాకుండా చూడడంలో విటమిన్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి. విటమిన్లు అంటే ఎ, బి, సి, డి, ఇ, కె లను విటమిన్లు అంటారు.


బి విటమిన్లు చాలా రకాలు ఉన్నాయి. విటమిన్లు మన శరీరంలో లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మన శరీరం పలు సంకేతాలను తెలియజేస్తుంది. విటమిన్ ఎ లోపం గనక ఉంటే కంటి చూపు తగ్గుతుందని అనుకుంటారు. కానీ ఈ విటమిన్ లోపిస్తే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే చర్మం కళను కోల్పోతుంది. విపరీతంగా మొటిమలు వస్తుంటాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. మహిళల్లో విటమిన్ ఎ లోపం ఉంటే హార్మోన్ల సమస్యలు వస్తాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

బి విటమిన్లు లోపిస్తే..

బి విటమిన్లు లోపిస్తే తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా విపరీతంగా అలసిపోయినట్లు ఫీలవుతారు. శరీరంలో శక్తి లేనట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు త్వరగా వచ్చేస్తాయి. రక్తం తగ్గుతుంది. పురుషుల్లో బి విటమిన్ల లోపం ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత అధికమవుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తలనొప్పి పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మలబద్దకం వస్తుంది. చర్మం పాలిపోయినట్లు అనిపిస్తుంది. పిల్లల్లో అయితే ఎదుగుదల లోపం వస్తుంది.

విటమిన్ సి అయితే..

విటమిన్ సి లోపిస్తే పిల్లల్లో ఎదుగుదల లోపం వస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చర్మం పాలిపోయి పొడిబారుతుంది. చర్మంపై మచ్చలు, మొటిమలు వస్తాయి. దంతాలు, చిగుళ్లు బలహీనంగా మారినట్లు అనిపిస్తాయి. రక్తస్రావం కూడా జరుగుతుంది. అనవసరంగా ప్రతి విషయానికి చిరాకు పడుతుంటారు. కోపం వస్తుంటుంది. ఇవన్నీ విటమిన్ సి లోపం ఉందని చెప్పేందుకు లక్షణాలే. విటమిన్ సి లోపం ఉంటే కండరాలు కూడా బలహీనంగా మారి నొప్పులు వస్తుంటాయి. విటమిన్ సి మనకు మాత్రల రూపంలోనూ లభిస్తుంది. కానీ అలా తీసుకోవడం కంటే ఆహారాలను తింటేనే మంచిది.

విటమిన్ డి లోపిస్తే..

విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్‌, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు పెళుసుగా మారి త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో అయితే ఎదుగుదల లోపం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల స్త్రీ, పురుషుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే విటమిన్ కె లోపిస్తే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టదు. దీంతో తీవ్ర రక్త స్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎముకలు బలహీనంగా కూడా మారుతాయి. ఇక ఇటమిన్ ఇ లోపిస్తే చర్మం పొడి బారి అంద విహీనంగా మారుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. పురుషుల్లో వ్యంధత్వం వస్తుంది. శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇలా ఆయా విటమిన్లు లోపిస్తే పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ఏ విటమిన్ల లోపం ఉందో తెలుసుకుంటే దాన్ని ఆహారం ద్వారా తగ్గించవచ్చు.