సీతకు విడాకులు.. ఇప్పటికీ సింగిల్‌గానే అద్దె ఇంట్లోనే ఉంటున్నా

ఆర్‌. పార్తీబన్‌ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించిన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశాడు.


వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా పని చేశాడు. రచయితగా, సింగర్‌గానూ తన టాలెంట్‌ చాటుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

సీత వల్లే ఆ సినిమా హిట్టు
డైరెక్టర్‌గా నా మొదటి సినిమా పుదియా పాడై (Pudhiya Paadhai). సీత నటించడం వల్లే ఈ సినిమా హిట్టయింది. తర్వాత సీతనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు. సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు. సరేనని ఊరుకున్నాను. తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్లీ యాక్టింగ్‌ మొదలుపెట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను.

అందుకే ఇంకా సింగిల్‌గానే..
అయితే ఇప్పటికీ సీతను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే 24 ఏళ్లయినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానమిచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. నా కొడుకు​, నేను మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నాము. సీతతో నేను టచ్‌లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాను అని చెప్పుకొచ్చాడు.

పార్తీబన్‌ కెరీర్‌
పార్తీబన్‌ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇతడు ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్‌ 1 వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.