ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్ పై మంత్రి కొండపల్లి కీలక ప్రకటన

ఏపీ శాసనమండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది. పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే వారి ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని గుర్తు చేశారు. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.


ప్రస్తుతం 60 ఏళ్ల వయసు, ఆపై దాటిన వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. అయితే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ 4 వేలు పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకోసం అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కూడా కృషి చేశారు. ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది. అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి పెన్షన్లను తొలగిస్తున్నారు.

రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారికి పింఛను అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు. ఇందు కోసం అధికారులు, మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు. ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్‌లు ఉన్నాయని.. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెంచామని.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు. యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.