How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

www.mannamweb.com


‘నా పరువు పోతుందేమో’.. చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్‌’ అంటారు మానసిక నిపుణులు.
‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్‌.
ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది.

‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్‌ ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్‌ మీడియా ద్వారా ఈ క్లబ్‌ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు.

‘జీవితంలో మార్పులు సహజం. కానీ జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు.. వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్‌ వైపు కాకుండా నెగెటివ్‌ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్‌ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు.
వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్‌.

ఆలోచన.. అతి ఆలోచన..
‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్‌. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే… వాన పడితే… వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది… లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్‌ అవుతాయి.

ధ్యాస మళ్లించాలి..
ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్‌
► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్‌ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు
► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్‌ చేద్దాం… చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి

► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి
► సోషల్‌ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి
► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్‌ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది
► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్‌ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి.

ఓవర్‌థింకర్ల లక్షణాలు ఇవే..
► ఆత్మవిమర్శ అధికంగా చేయడం
► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్‌ఫెక్షనిజం)
► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం

► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం
► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం
► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం
► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం.