తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది.
వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌కు కీలక పదవి వస్తుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది.
ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. కమిషన్ సభ్యులుగా మాజీ ఐపీఎస్ అధికారిణి అనితా రాజేంద్రం, పాల్వాయి రజనీ కుమార్, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను నియమించారు.