బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా- ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినట్టయింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసిందా సంస్థ. సోమవారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది.
ఆదివారం కాకినాడలో ఓ మోస్తారు వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య రాయచోటి, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. కృష్ణా జిల్లా పెదవుటపల్లిలో 68.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2, ఎర్రగొండపాలెంలో 62 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మిగిలిన 18 ప్రాంతాల్లో 20 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. గురువారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 23 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విజ్ఞప్తి చేశారు.