టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్- 2025లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఎదురైన ఓ ప్రశ్నకు మిస్టర్ కూల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో టీమ్‌ఇండియాలోని నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
గతంలోని క్రికెటర్లలో ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారు అని ఎదురైన ప్రశ్నకు మహీ సమాధానమిచ్చాడు. ‘‘మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar), సౌరభ్ గంగూలీ (Sourav Ganguly), యువరాజ్ సింగ్‌లతో (Yuvraj Singh) కలిసి ఆడాలని కోరుకుంటున్నా. వీరూ పా (వీరేంద్ర సెహ్వాగ్) ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆడడం కష్టం. ఆ పరిస్థితుల్లో ఏ రీతిలో ఆడాలో నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. ఆ సమయాల్లోనూ ఈ ఆటగాళ్లు ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరూ పా, దాదా (సౌరభ్ గంగూలీ) ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ పంచుకున్నాడు.
2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ధోనీ గుర్తు చేసుకున్నాడు. నాడు యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్ల గురించి ప్రస్తావించాడు. అందరు ఆటగాళ్లూ తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనంటూ వ్యాఖ్యానించాడు. కాగా.. ఐపీఎల్- 2025 (IPL 2025) 18వ సీజన్‌లో మహీ సీఎస్కే తరఫున బ్యాటర్, వికెట్‌కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చైన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన మహీ.. ఆ వార్తలను ఖండించాడు. సీజన్ పూర్తయ్యేవరకూ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.