సౌర విద్యుత్తు వినియోగించడంలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇంటింటికీ సౌర విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడానికి పంచాయతీల మధ్య పోటీ పెంచింది. సౌరశక్తిలో ఆదర్శంగా నిలిచిన జిల్లాకు ఒక గ్రామానికి కోటి రూపాయల నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సభ్యలు అయిదు వేల జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆయా గ్రామాల్లో ఇంటింటికీ సౌర విద్యుత్తు ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఉత్తమంగా నిలిచిన వాటికి నగదు పురస్కారం దక్కనుంది.
వినియోగం పెరగడంతో సోలార్ ఎనర్జీపై ఆసక్తి : పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి, అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాల కింద సౌరశక్తి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ కల్పిస్తోంది. ఇప్పటికే గృహావరసరాలకు విద్యుత్తు వినియోగం పెరగడంతో చాలా మంది ఇంటి పై కప్పులపై సౌర ఫలకలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సౌర విద్యుదుత్పత్తిని విస్తరించేందుకు గ్రామాల మధ్య పోటీ పెంచింది. కలెక్టర్ ఛైర్మన్‌గా, రెడ్కొ అధికారి కన్వీనర్‌గా, అదనపు కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జడ్పీ సీఈవో, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి, పీఆర్ ఈఈ, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సభ్యులుగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో అయిదు వేల జనాభా కలిగిన గ్రామాలను ఎంపిక చేస్తారు.
ఆ ప్రోత్సాహకం కేవలం దానికే : కేంద్ర ప్రభుత్వం అందజేసే నజరానా కోసం గ్రామాలు పోటీ పడనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో 21 గ్రామాలను ఎంపిక చేశారు. మిగిలిన మూడు జిల్లాల్లో గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఆరు నెలల్లో ఇళ్ల పైకప్పులపై అత్యధికంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని విద్యుత్తు ఉత్పత్తి చేసిన గ్రామాలను జిల్లా స్థాయి కమిటీ ‘మోడల్ సోలార్ విలేజ్’గా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నిధులతో గ్రామంలోని గవర్నమెంట్ భవనాల పైకప్పులపై సౌర ఫలకలు ఏర్పాటు చేస్తారు. కాగా కేంద్రం అందించే ప్రోత్సాహకంతో సౌర విద్యుత్తు తప్ప ఇతర అభివృద్ధికి నిధులు కేటాయించరాదు.
వినియోగంపై చైతన్యం :
ఎంపిక చేసిన గ్రామాల్లో సౌర విద్యుత్తుపై అవగాహన కల్పిస్తారు.
సౌర విద్యుత్తు ప్యానెళ్ల ఏర్పాటుకు 2 కిలోవాట్స్‌కు రూ.60 వేలు, 3 కిలోవాట్స్‌కు రూ.78 వేల రాయితీ కల్పిస్తోంది.
పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల్లో రుణం తీసుకొనేలా ప్రోత్సహిస్తారు.
స్వశక్తి సంఘాల సహకారంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు.
కలెక్టర్ పర్యవేక్షణలోనే ఎంపిక : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కరీంనగర్ జిల్లాలో అయిదు వేల జనాభా ఉన్న గ్రామాలను కలెక్టర్ పర్యవేక్షణలో ఎంపిక చేస్తున్నారని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ అజయ్ తెలిపారు. ఆయా గ్రామాల్లో సంబంధిత అధికారుల సహకారంతో అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. సోలార్ ఫలకల ఏర్పాటు కోసం ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెడ్కో అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే ప్యానెళ్లు తీసుకోవాలని చెప్పారు.
































