రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల(Village/Ward, Secretariats) విభజన పూర్తి అయింది. మూడు కేటగిరిలుగా చేస్తూ కూటమి ప్రభుత్వం(Coalition Government) ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ శాఖల కార్యదర్శులను ఆయ సచివాలయకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కార్యదర్శులను సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2500 మంది జనాభా ఉన్న సచివాలయాలకు ఇద్దరు సిబ్బందిని కేటాయించింది.
కాగా తాము అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన చేపడతామని అప్పటి కూటమి నాయకులు చంద్రబాబు(Chandrababu Naidu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా అడుగులు వేశారు. ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టారు.
అయితే వీరిలో కొందరికి పని తక్కువ ఉండగా.. మరికొందరిపై భారం పడుతోందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ధ్రువపత్రాల జారీలో డిజిటల్, వెల్ఫేర్ సహాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. పలు చోట్ల ఇంచార్జులే అదనంగా సేవలు అందిస్తున్నట్లు స్పష్టమైంది. మరికొన్ని చోట్ల టెక్నికల్ సిబ్బంది లేకపోవడంతో ఆయా పనులన్నీ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది చేస్తున్నట్లుగా గుర్తించింది. ఉద్యోగుల్లో చాలా మంది ఇంజినీరింగ్, డిప్లొమా, పీజీ, పీహెచ్డీ చదివిన వారుండటంతో క్షేత్రస్థాయిలో విస్తృతంగా సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఈ మేరకు ఉద్యోగుల సీఎఫ్ఎంఎస్ ఐడీ, సెల్ ఫోన్ నెంబర్, విద్యార్హత, కులం, ఉపకులం వివరాలను ప్రభుత్వం సేకరించింది. బీటెక్, ఎంటెక్లో ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్, పీజీ, పీహెచ్డీ చేసిన వారి సమాచారాన్ని కూడా పరిశీలించింది. నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఆహారశుద్ధి, మార్కెటింగ్ ఇతర అంశాల్లో వీరికి అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో అవసరమైన ప్రాంతాలకు వారిని సర్దుబాటు చేశారు.
































