ATMs in Trains: రైళ్లలో ATMలు ఏర్పాటు చేయాలనే రైల్వే సంచలన నిర్ణయం

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు.


యూపీఐ పేమెంట్స్ పెరగడంతో.. జేబులో డబ్బులు తీసుకెళ్లేవారి సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. రోడ్డు పక్క కొబ్బరి బొండాలు మొదలు.. పెద్ద పెద్ద మాల్స్ వరకు ఎక్కడ ఎలాంటి కొనుగోలు చేసినా.. అన్నీ యూపీఐ పేమెంట్సే. అయితే ప్రతి చోటా మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో కొన్ని సందర్భాల్లో సిగ్నల్ సరిగా రాదు. దాంతో యూపీఐ పేమెంట్స్ కష్టం అవుతుంది. ట్రైన్‌లో కొందరు చిరు వ్యాపారుల దగ్గర యూపీఐ పేమెంట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి.. రైలు ప్రయాణంలో సడెన్‌గా డబ్బులు అవసరం పడితే ఎలా అంటే.. ఇదుగో సమాధానం..

దేశంలోనే తొలిసారి రైలులో ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర రైల్వే శాఖ. ఇందుకోసం ముందుగా ముంబై-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఈ కదిలే ఏటీఎంను ఇన్‌స్టాల్ చేసింది. రైలు ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ ఏటీఎంను ఏసీ చైర్ కోచ్‌లో ఇన్‌స్టాల్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో కలిసి ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రయాణికులు ఈ ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు అని సెంట్రల్ రైల్వే తెలిపింది.

ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. “ఈ ఏటీఎంను కోచ్ చివర్లో ఏర్పాటు చేశాము. గతంలో ఈ స్థలాన్ని ప్యాంట్రీ కోసం వినియోగించేవాళ్లం. ఏటీఎం సంరక్షణ కోసం షట్టర్ డోర్‌ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కోచ్‌లో ఏటీఎంను ఏర్పాటు చేయడం కోసం అవసరమైన మార్పులు చేర్పులను మన్మాడ్ రైల్వే వర్క్‌షాప్‌లో చేశాం. ఈ పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి నాసిక్ జిల్లాలోని మన్మాడ్ జంక్షన్‌కి ప్రయాణం చేస్తుంది. ఒకవైపు ప్రయాణం పూర్తి కావడానికి సుమారు 4.35 గంటల సమయం పడుతుంది. ఈ కదిలే ఏటీఎం ప్రయోగం విజయవంతం అయితే.. త్వరలోనే మరిన్ని రైళ్లలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.”

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.