శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!


అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మాణం పై టీటీడీ దృష్టి – విజన్ 2047కు శ్రీకారం


తిరుమల కొండపై పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రాకపోకలకు కారణమవుతున్న ట్రాఫిక్ మరియు పర్యావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మాణంపై పూర్తిగా దృష్టి సారించింది. ‘విజన్ 2047’ లో భాగంగా ఈ క్యాంప్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలిపిరి నుంచే భక్తుల నియంత్రణకు ప్రణాళిక

అలిపిరిలో పార్కింగ్, వసతి, ఇతర అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి, అక్కడినుంచే కొండపైకి భక్తులను నియంత్రించాలన్నది టీటీడీ లక్ష్యం. ప్రతి రోజు సప్తగిరి తనిఖీ కేంద్రం నుండి దాదాపు 10 వేల వాహనాలు తిరుమలకి వెళ్తుండటంతో, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ పెరిగి, శబ్ద కాలుష్యం అధికమై, శేషాచలం అటవీ ప్రాంతంలో ఎకో సిస్టమ్‌కు ముప్పుగా మారుతోంది.

ముంతాజ్ హోటల్ భూమిలో బేస్ క్యాంప్ ఏర్పాటు

ఇంతకుముందు వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, అదే ప్రాంతంలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది తిరుమలకు వచ్చే భక్తుల రద్దీకి తగినట్లుగా వసతి, పార్కింగ్ మరియు ఇతర సౌకర్యాల కల్పనకు అనుకూలంగా మారింది.

భక్తుల సంఖ్య పెరుగుతోందా, వసతులు తగ్గిపోతున్నాయా?

పూర్వం ఏడాదికి 35 లక్షల మంది మాత్రమే వెంకన్న దర్శనానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు 70 వేల మంది నుంచి సెలవుల్లో 90 వేల మంది వరకు చేరుకుంటున్నారు. 2024లో 2 కోట్ల 55 లక్షల మంది భక్తులు తిరుమల దర్శించుకున్నారు. అయితే, తిరుమలలో ఉన్న వసతి సౌకర్యాలు కేవలం 40 వేల మందికే సరిపోతున్నాయి. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరగబోతుందని అంచనా వేసిన టీటీడీ, తిరుమలలో కొత్త వసతి గదులు నిర్మించడం కష్టసాధ్యమన్న అభిప్రాయంతో, అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుంది.

తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా పరిరక్షించాలన్న ఉద్దేశం

కొండపై మరిన్ని వసతులు నిర్మించడం వలన చెట్లు నరికాల్సిన పరిస్థితి వస్తుందని, అది పర్యావరణానికి భంగం కలిగిస్తుందని టీటీడీ భావిస్తోంది. అందుకే 25 వేల మంది భక్తులకు తగిన సౌకర్యాలతో అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి, అక్కడినుంచి శuttleలు ద్వారా భక్తులను తిరుమలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.