కావసాకీ వారి కీలుగుర్రం “కోర్లియో” – రోబోటిక్ భవిష్యత్తు యొక్క విప్లవం

1949లో విడుదలైన శోభనాచల పిక్చర్స్ వారి ‘కీలుగుర్రం’ ఆకాశంలో ఎగురుతుంది! మూడు సముద్రాలు దాటి రాకుమారి ఉన్న దీవికి చేరుకుంటుంది! రాజ్యాన్ని కాపాడుతుంది. విక్రమసేనుడిని అంగరాజ్య సేనాధిపతిగా చేస్తుంది. 76 ఏళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి కీలుగుర్రమే సోషల్ మీడియాలో స్వారీ చేస్తోంది! కొండలపైకి ఎక్కుతోంది. నదులను, గట్లను దాటుతోంది. లోయల మీదుగా గెంతుతోంది. చిరుతపులిలా వంగి సాగి గాలిలోకి ఎగురుతోంది. అడవుల్లో పరుగులు తీస్తోంది. ఇవన్నీ ఒక మనిషిని మోసుకుంటూ చేస్తోంది. ఈ కీలుగుర్రాన్ని ‘సృష్టించింది’ కావసాకీ వారు. దీనికి పేరు ‘కోర్లియో’.


కంప్యూటర్ జనరేటెడ్ కాన్సెప్ట్

‘కోర్లియో’ ఒక కీలుగుర్రం, కానీ ఇది నిజంగా జీవం పోసుకోలేదు. ఇది కంప్యూటర్ ద్వారా రూపొందించబడిన ఒక భావన. రోబో కీలుగుర్రం ఎలా పనిచేస్తుంది? మానవ జీవితాన్ని ఎన్ని రకాలుగా సులభతరం చేస్తుంది? అనేదానిపై కావసాకీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జపాన్ లోని ఒసాకాలో జరుగుతున్న ‘కాన్సాయ్ ఎక్స్పో 2025’లో కావసాకీ ఈ ‘కోర్లియో’ కీలుగుర్రం కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. కోర్లియో డిజైన్‌లో ప్రధానమైనవి దాని నాలుగు రోబో కాళ్లు. ఇవి స్థిరంగా ఉండి, పరుగులు, దుముకులు, ముందుకు-వెనక్కు కదలికలకు అనువుగా ఉండే సాంకేతికతతో రూపొందించబడ్డాయి.

విప్లవాత్మకమైన చలనశీలత

రోబోలు ముందుకు, వెనక్కు కదలడం, వివిధ రంగాల్లో సేవలు అందించడం, సైనిక వ్యూహాలకు అనుగుణంగా పనులు చేయడం వంటివి సాధారణం. కానీ ‘కోర్లియో’ ప్రత్యేకమైనది. ఇది అడ్డంకులు ఎదురైనప్పుడు స్వయంచాలకంగా మార్గం కనుగొంటుంది. సాధారణ వాహనాలు వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా సురక్షితంగా ప్రయాణిస్తుంది. ఇది రోబోటిక్స్ రంగంలో ఒక విప్లవాత్మకమైన అధిచలనశీలతను సూచిస్తుంది.

‘కోర్లియో’ డిజైన్ వెనుక ఉన్న సాంకేతికత

రోబో ఒక సంక్లిష్టమైన యంత్రం, ఇది రెండు ప్రధాన భాగాలతో రూపొందించబడింది: శరీరం మరియు సమాచార ప్రాసెసింగ్ యూనిట్. ఇవి పనిచేయడానికి యాక్యుయేటర్లు (శక్తిని భౌతిక చలనంగా మార్చే పరికరాలు) మరియు సెన్సర్లను ఉపయోగిస్తాయి. కానీ చక్రాల వాహనాలతో పోలిస్తే, రోబో కాళ్లు తమ సమతుల్యతను కాపాడుకోవాలి మరియు తమ బరువును మోయాలి.

ఇది తనపై కూర్చున్న వ్యక్తికి కుషనింగ్ ఇవ్వడానికి సస్పెన్షన్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. కోర్లియోకు మరింత శక్తివంతమైన యాక్యుయేటర్లు అవసరం. ఈ సాంకేతికతను మరింత అధునాతనం చేస్తే, కొండలు ఎక్కే, నీటి మీదుగా ఎగిరే కీలుగుర్రాన్ని తయారు చేయవచ్చు అని కావసాకీ భావిస్తోంది.

కోర్లియో యొక్క ప్రత్యేక లక్షణాలు

  • 2050 నాటికి పూర్తిగా పర్యావరణ స్నేహశీలమైన ఆవిష్కరణ

  • ఇంటెలిజెంట్ డిజైన్

  • మనిషిలాగే సహజమైన కదలికలు

  • హైడ్రోజన్ ఇంజిన్ ద్వారా నడుపబడుతుంది

  • ప్రతి కాలికి ఒక హైడ్రోజన్ ఇంజిన్

  • కొండలు, అడవుల్లో సులభమైన ప్రయాణం

  • చిరుతపులిలా వంగే సామర్థ్యం, రబ్బర్ డెక్కులు

  • బాడీ కదలికలే స్టీరింగ్ కోసం ఉపయోగపడతాయి

  • రాత్రి ప్రయాణాలకు గైడింగ్ మార్కర్లు

  • మానవ ఆలోచనలు మరియు యంత్ర మేధ సమన్వయం

ఇది అంత సులభమేనా?

కోర్లియో ప్రస్తుతం ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఇది ఇంకా నిజమైన ప్రపంచంలో లేదు. దీన్ని ఒక ఆఫ్-రోడ్ క్వాడ్ బైక్ యొక్క అధునాతన వెర్షన్‌గా భావించవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, టూరిజం, సాహస క్రీడలు మరియు డిసేబుల్డ్ వ్యక్తులకు సహాయక పరికరాలుగా ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే, ఇది ఒక అద్భుతమైన మార్పును తీసుకురాగలదు.

అయితే, ఇది నిజంగా నాలుగు కాళ్లతోనే ఉండాలనే అవసరం ఉందా? అని ‘కాన్సాయ్ ఎక్స్పో 2025’లో కొందరు రోబోటిక్స్ నిపుణులు ప్రశ్నించారు. అసలు సవాలు ఏమిటంటే, అడవుల్లో సులభంగా ప్రయాణించడానికి, భద్రత మరియు సమర్థవంతమైన లోకోమోషన్ అల్గోరిథంలను అభివృద్ధి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.