భాద్యత గల భారతీయ పౌరులు అందరూ ఏటా ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాలి. ITRను సమర్పించిన తర్వాత, పన్ను శాఖ ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో?
లేదో? తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను తనిఖీ చేస్తుంది. చెల్లించిన పన్నులు, పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే, లేదా ఇతర లోపాలను అధికారులు గుర్తిస్తే, వారు నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. అందుకే ఐటీఆర్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులోఆదాయ పన్ను శాఖ నుంచి ఏవైనా విచారణలు ఎదురుకావచ్చు. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆధారాలు చూపించేందుకు అవసరం అవుతాయి.
* 10 సంవత్సరాల వ్యవధికి నోటీసు
బ్లాక్ మనీ చట్టం ప్రకారం.. పన్ను చెల్లింపుదారు తన ITR డాక్యుమెంట్లను ఎంతకాలం భద్రపరచుకోవాలనే అంశంపై నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు. కానీ ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్ విషయంలో, ఆదాయ పన్ను శాఖ 10 సంవత్సరాల వ్యవధిలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 147 కింద నోటీసు జారీ చేయవచ్చు.
ఆదాయ పన్ను చెల్లింపుదారుడు తన ఐటీఆర్ పత్రాలను ఎంతకాలం ఉంచుకోవాలి అనే అంశంపై ముంబైకి చెందిన పన్ను, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. బ్లాక్‌మనీ యాక్ట్ ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు తన ఐటీఆర్ పత్రాలను ఎంత కాలం ఉంచుకోవాలనే నిర్దిష్ట సమయం పేర్కొనలేదన్నారు. అయితే ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్ కింద నోటీసు పంపే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉందని, ఈ నోటీసును 10 సంవత్సరాల వరకు ఐటీఆర్ ఫైలింగ్ కోసం పంపవచ్చని తెలిపారు.
* ఐటీఆర్ డాక్యుమెంట్లు ఎంత కాలం ఉంచుకోవాలి?
ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్, బ్లాక్ మనీ యాక్ట్ నిబంధనలపై డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆర్తీ రౌటే మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారు కనీసం 10 సంవత్సరాల పాటు తన పన్ను రికార్డులను భద్రపరచుకోవాలని అన్నారు. సాధారణంగా కొన్ని నెలల్లోనే పన్ను రిటర్న్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన సమాచారం అందుతుందని, పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినప్పటి నుంచి నెలల తరబడి ఏవైనా ప్రాథమిక సర్దుబాట్లు జరుగుతాయని చెప్పారు.
అయితే సాధారణంగా పన్ను రిటర్న్‌ను అందించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి మూడు నెలల వ్యవధిలో ఎప్పుడైనా సవివరమైన అసెస్‌మెంట్ కోసం నోటీసును ఆశించవచ్చన్నారు. ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్ సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి 3 సంవత్సరాల గడువు ముగిసేలోపు నోటీసు పంపుతారని తెలిపార. ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్ రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సందర్భాల్లో, నోటీసును 10 సంవత్సరాల వ్యవధి వరకు జారీ చేసే అవకాశం ఉందని వివరించారు.
Deloitte India నిపుణులు.. పన్ను చెల్లింపుదారులకు కనీసం 10 సంవత్సరాల పాటు ITR పత్రాలను ఉంచుకోవాలని సూచించారు. తద్వారా ఆదాయ పన్ను శాఖ నుంచి అందే నోటీసులకు పూర్తి ఆధారాలతో సమాధానం చెప్పగలరని పేర్కొన్నారు. బ్లాక్ మనీ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి ఎలాంటి కాలపరిమితి లేదని గమనించాలి. అందువల్ల పన్ను డాక్యుమెంట్లను ఎక్కువ కాలం నిర్వహించడం కష్టంగా ఉన్నప్పటికీ, పన్ను అధికారి నోటీసుకు ప్రతిస్పందించడానికి వీలుగా డాక్యుమెంట్లను కనీసం సాఫ్ట్ కాపీ రూపంలో భద్రపరచుకోవాలి.