నీది మాత్రం బాగుందా?.. జగన్ వర్సెస్ ‘సొంత’ జిల్లా ఎమ్మెల్యే
తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎంకు షాక్
‘సర్వేలో వ్యతిరేకత’ అని చెప్పిన సీఎం
నేనేం మర్డర్లు చెయ్యలేదు: ఎమ్మెల్యే
(అమరావతి – ఆంధ్రజ్యోతి)
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
మరోవైపు… ఆయనకు సన్నిహితుడు, అపాయింట్‌మెంట్ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగల ఎమ్మెల్యే!
ఇద్దరి మధ్య ‘ఢీ అంటే ఢీ’! విశ్వసనీయ సమాచారం ప్రకారం… అభ్యర్థుల మార్పుచేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్… కడప జిల్లాకు చెందిన ఆ శాసన సభ్యుడిని రెండు రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు. ”నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమీ బాలేదు” అని ఆయన ముఖాన్నే చెప్పారు. అయితే… ఇతర ఎమ్మెల్యేల్లాగా ఆ ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు.. అప్పటికప్పుడే జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ”రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా?” అని సూటిగా ప్రశ్నించారు. ‘ఎవరి పరిస్థితి ఏమిటో ఓటర్లే తేలుస్తారులే’ అని వ్యాఖ్యానించారు. ‘సర్వేలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నా’ అని సీఎం అనగానే, ‘నేనేం మర్డర్లు చెయ్యలా! చేయించినోడిని వెనకేసుకు రాలా!’ అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. దీంతో జగన్ ఒక్కసారిగా సహనం కోల్పోయి… ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నేనేం చెబుతున్నా.. నువ్వేం మాట్లాడుతున్నావ్..’ అంటూ సీరియస్ అయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి ‘సమయస్ఫూర్తి’ ప్రదర్శించారు. వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే గట్టిగా తన వాదన వినిపించారు. ”పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారా? ఇడుపులపాయలో ప్రశ్నించింది తెలీదా? నేనెప్పుడూ నా నియోజకవర్గ కేడర్‌కు అందుబాటులో ఉంటా? నాపై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అవినీతి నేనొక్కడినే చేశానా? మిగతా వాళ్లందరూ పత్తిత్తులా? రాష్ట్రంలో అవినీతి
కేంద్రీకృతమైందని దేశమంతా అంటున్నారు. నా సీటు ఎవడికిస్తాడో ఇచ్చుకోమను. ఎలా గెలుస్తాడో నేనూ చూస్తా!!’ అంటూ కారెక్కి వెళ్లిపోయారు.