విశాఖపట్నం ప్రయాణికులకు శుభవార్త.. ఆ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.


ఈ ప్రత్యేక రైలు వివరాలు ఇలా ఉన్నాయి: ట్రైన్ నెం. 07441 (చర్లపల్లి – విశాఖపట్నం): ఈ రైలు మే 17, 2025 శనివారం మధ్యాహ్నం 2గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు అంటే 18వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ట్రైన్ నెం. 07442 (విశాఖపట్నం – చర్లపల్లి): తిరుగు ప్రయాణంలో ఈ రైలు మే 18,2025 ఆదివారం రోజున రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 19వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఇక ఈ స్పెషల్ ట్రైన్స్ నల్లగొండ, మిరియాలగూడ,నడికుడి,గుంటూరు, విజయవాడ,ఏలూరు,రాజమండ్రి, సామర్లకోట,అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా చర్లపల్లి మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం లభించనుంది. వేసవిలో తరచుగా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ఈ రైళ్లలో 3AC, 3AC (ఎకానమీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ల రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఈ ప్రత్యేక రైళ్ల సమయం, ఇతరవివరాల కోసం రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌లను సంప్రదించవచ్చు. వేసవి రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ చర్యపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.