మీరు సిలిండర్ వాడుతున్నారా.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులా? అయితే మీకు అదిరే శుభవార్త. వెంటనే ఈ విషయం తెలుసుకోండి.
ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఎందుకంటే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది చాలా ముఖ్యం. కట్టెల పొయ్యి మీద ఇప్పుడు దాదాపుగా ఎవ్వరూ వంట చేసుకోవడం లేదనే చెప్పుకోవచ్చు. అంటే సిలిండర్‌పై ఏ స్థాయిలో ఆధారపడ్డామో అర్థం అవుతుంది. అందుకే సిలిండర్ రేట్లు కూడా నానాటికీ పెరుగుతూనే వస్తున్నాయి.
అయితే ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీ మీద సిలిండర్లను అందిస్తున్నాయి. తెలంగాణలో అయితే రూ500 కే సిలిండర్ లభిస్తోంది. ఇక ఏపీలో అయితే ఉచితంగానే సిలిండర్ పొందొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ విధానంలో కొత్త మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గమనిస్తే.. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగానే లభిస్తాయి. అంటే 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందొచ్చు. మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలి.
రెండో ఎల్పీజీ సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు బుక్ చేసుకోవచ్చు. ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జులై 1 నుంచి నవంబర్ 30 వరకు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానమే అమలులో ఉంది.
అయితే ఇకపై కొత్త విధానాన్ని తీసుకు రావాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందు గానే దీపం పథకం కింద డబ్బులు చెల్లించాలని భావిస్తోంది. ఇది కూడా మంచి నిర్ణయమనే చెప్పుకోవచ్చు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రజలు తమ డబ్బులతోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 911 పెట్టి సిలిండర్ బుక్ చేయాలి. అటు పైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లో మీ డబ్బులు మళ్లీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.
ప్రస్తుతం ఇలా కొనసాగుతూ వస్తోంది. అయితే కొంత మంది లబ్దిదారులకు ఈసారి అంటే రెండో విడత సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు తిరిగి అకౌంట్లలో పడలేదనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వపు కొత్త విధానన్ని అమలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు.
ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కన్నా ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సంవత్సరంలో ఉచితంగా అందించే మూడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డబ్బును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంటే ప్రస్తుత సిలిండర్ ధర రూ.911 వద్ద ఉంది. మూడు సిలిండర్లకు అంటే.. రూ. 2733 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం లబ్దిదారలుకు అందించే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేంద్ర సబ్సిడీ రూ.47 తీసేస్తే.. దాదాపు రూ. 2600 ఒకేసారి రావొచ్చు. కాగా ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.
































