పసుపు వంటకు రంగు, రుచి ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం శరీరంలో ఇన్ ఫెక్షన్లు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మనం వంటల్లో వాడే పసుపు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. పసుపును ఇంకా ఎక్కువగా ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర చెంచా పసుపు కలిపి తాగితే శరీరం శుభ్రపడుతుంది. ఇందులో కొద్దిగా తేనె, అల్లం కలిపితే రుచి ఇంకా బాగుంటుంది. దీన్నే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. రాత్రి పడుకునే ముందు తాగితే నిద్ర బాగా పడుతుంది. శరీరంలోని అలసట తగ్గుతుంది.
నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా పసుపు వేసి రుచి కోసం నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. దీన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరం శుభ్రపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి. వేసవిలో కూడా ఈ టీ తాగొచ్చు.
సలాడ్లు తరచుగా తినే వాళ్లు వాటిలో కొద్దిగా పసుపు చల్లుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. పసుపు సలాడ్ ల రుచిని మార్చకుండా వాటి పోషక విలువలను పెంచుతుంది. కొద్దిగా నూనె, నిమ్మరసం చల్లి, పసుపు కలిపితే సలాడ్ రుచిగా ఉంటుంది.
పండ్లతో చేసే స్మూతీలలో అర చెంచా పసుపు కలిపితే రుచిలో పెద్దగా మార్పు లేకుండానే ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇది ముఖ్యంగా శరీరంలోని వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని పిల్లలకు కూడా తేలికగా ఇవ్వవచ్చు.
కొంతమంది మాత్రమే ఆమ్లెట్, అండా భుర్జీ వంటి వంటల్లో పసుపు వాడతారు. కానీ కోడిగుడ్డుతో చేసే ప్రతి వంటలో పసుపు కలిపితే అది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. పైగా రుచిలో పెద్దగా మార్పు ఉండదు.
సూప్ లు, పప్పులు, కూరలు చేసేటప్పుడు సాధారణంగా వేసే పసుపు మోతాదును కొద్దిగా పెంచితే ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే మరీ ఎక్కువ వాడకూడదు.. తగిన మోతాదులో మాత్రమే వాడాలి.
ఇలా పసుపును మన రోజువారీ ఆహారంలో రకరకాలుగా చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు లభిస్తాయి. ఈ చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































